– బాంబు ఉన్న సంచిని కొరికి కుక్క మృతి
భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: కొత్తగూడెం రైల్వే స్టేషన్ (భద్రాచలం రోడ్డు)లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం ఓ ఆగంతకుడు స్టేషన్ మొదటి ప్లాట్ ఫాంపై నల్లటి సంచి ఉంచి వెళ్లిపోయాడు. దానిని ఎవరూ గమనించలేదు. అయితే సంచిలో తినే పదార్థం ఉందనుకుందో ఏమో కుక్క ఆ సంచిని నోట కరచుకుని రైల్వే ట్రాక్‌పైకి తీసుకెళ్లింది. సంచిలోని ఉల్లిగడ్డ ఆకారంలో ఉన్న బాంబును కొరకడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దాంతో ఆ కుక్క అక్కడికక్కడే మృతిచెందింది. బాంబు పేలుడుతో స్టేషన్‌లోని ప్రయాణికులు భ్రయభ్రాంతులై పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో కొత్తగూడెం 3వ పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయేమోనని జాగిలాలతో రైల్వే స్టేషన్ మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సవిూపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. రైల్వే స్టేషన్‌లోకి ఆగంతకుడు ఎటువైపు నుంచి వచ్చాడు.. ఎటు వైపు వెళ్లాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కుట్ర కోణం లేదు: జిల్లా ఎస్పీ
రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ విలేకరులకు వెల్లడించారు. అడవి జంతువుల కోసం ఈ నాటు బాంబులు వినియోగిస్తారని, గుర్తు తెలియని వ్యక్తులు ఈ బాంబులు ఉన్న సంచులను చెత్త కుప్పలో పడేశారని వివరించారు. ఆ సంచులను వీధి కుక్కలు రైల్వే ట్రాక్‌పై తీసుకొచ్చి అందులోని వస్తువులను తినే ప్రయత్నం చేసిన క్రమంలో పేలుడు సంభవించిందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





