– తెలంగాణలో కమలానికి ఆక్సిజన్‌గా సంజయ్
– ప్రత్యర్థుల ఇలాకాలో ప్రవేశించగలిగే సత్తా
– పదునైన విమర్శలే ఆయుధం
– ఎదుటివారిని గుక్కతిప్పుకోనీయని నైజం
– రేవంత్‌ను ఎదుర్కొనగల సత్తా వున్న నాయకుడు
– ఉత్తర తెలంగాణలో బీజేపీ బలోపేతం
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడినప్పటికీ చాకచక్యంగా పావులు కదిపి బీజేపీ అభ్యర్థిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా బండి సంజయ్ తన సొంత గడ్డపై ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోయినా స్వతంత్రులను కలుపుకొని కొలగాని శ్రీనివాస్ ను మేయర్ గా కూర్చోబెట్టడం ద్వారా కరీంనగర్ తన సొంత సామ్రాజ్యం అని ఆయన మరోసారి చాటిచెప్పారు. ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ల ఎత్తులను చిత్తు చేస్తూ అధికార పీఠాన్ని దక్కించుకున్న బండి సంజయ్ ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అని చెప్పవచ్చు.
(ప్రజాతంత్ర, కరీంనగర్)
ప్రత్యర్థులను తన వాగ్ధాటితో గుక్కతిప్పకుండా చేయగల సామర్థ్యం బండి సంజయ్‌కే సాధ్యం. రేవంత్ దూకుడు వ్యవహారశైలిని తిప్పికొట్టగల శక్తియుక్తులు ఆయన సొంతం. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ వాగ్ధాటిని ఎదుర్కొనడం ఎవరివల్ల కాలేదు. ప్రస్తుతం రేవంత్ తనశైలి దూకుడును ప్రదర్శిస్తుండటంతో ప్రత్యర్థులకు ఆయన్ను అడ్డుకోవడం సాధ్యంకావడంలేదు. కానీ బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ తన సంచలన ఆరోపణలతో రేవంత్ వొరవడికి అడ్డుకట్ట వేయగలడు. దీన్ని చాలా సందర్భాల్లో నిరూపించారు కూడా. అవసరమైతే ప్రత్యర్థుల ఇలాకాలోకి ప్రవేశించి విజయంతో వెనక్కి రాగలడు. ఇందుకు తాజా ఉదాహరణ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏఐఎంఐఎంకు గట్టి పట్టున్న కాశ్మీర్‌గడ్డను బీజేపీ ఖాతాలో జమ చేయడం! ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం కార్యకర్తల సమీకరణతోపాటు, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను గట్టిగా ఎదుర్కొనే సామర్థ్యాన్నిచ్చింది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 66 స్థానాల్లో 30 బీజేపీ గెలుచుకోవడం వెనుక ఆయన నాయకత్వం, అనుసరించిన చాణక్యం, అమలు చేసిన వ్యూహం వున్నాయి. ఆ విధంగా కరీంనగర్ పై మొట్టమొదటిసారి కాషాయ జెండా ఎగరడానికి దోహదం చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా అంతకుముందు కేవలం 7శాతం వున్న ఓటు షేర్‌ను ఏకంగా 33శాతానికి తీసుకెళ్ల గలిగారు. అయితే ఆయన్ను పార్టీ అధ్యక్ష పదవినుంచి తొలగించడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్, బీజేపీ నాయకత్వం మధ్య కుదిరిన రహస్య ఒప్పందమే కారణమని అప్పట్లో సినీ నటి విజయశాంతి ప్రకటించడం సంచలనం సృష్టించింది. అయితే ఈటల రాజేందర్‌తో ఆయనకున్న విభేదాల నేపథ్యంలో అధిష్టానం తటస్థ వ్యక్తిగా కిషణ్‌రెడ్డిని రంగంలోకి దించిందన్నది తర్వాతి విశ్లేషణలు తెలిపాయి. ఏమైనప్పటికీ బండి సంజయ్‌ను అధ్యక్ష పదవినుంచి తొలగించిన తర్వాత పార్టీ ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో పుంజుకోలేదన్నది నిష్టుర సత్యం. అధ్యక్ష పదవినుంచి వైదొలగిన తర్వాత ఆయన చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుదిపేసింది. అయితే సంజయ్ నాయకత్వ పటిమను గుర్తించిన అధిష్టానం కేంద్ర మంత్రిపదవితోపాటు, పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించి రాష్ట్ర రాజకీయాలపై ఆయన ప్రభావం వుండేలా జాగ్రత్త పడింది. ఒకవేళ నేటి పరిస్థితిలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా వున్నట్లయితే, రేవంత్ దూకుడును సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాదు, 90కి పైగా మున్సిపాలిటీలను గెలుచుకోవడం కాంగ్రెస్‌కు సాధ్యమయ్యేది కాదనేది పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తుందని, మరి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు అందుకు సిద్ధమా అని ప్రశ్నించి ఇరుకున పెట్టారు. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను బీజేపీ పవర్‌హౌజ్‌లుగా మార్చేసిన ఘనత ఆయనది.
సంజయ్ వ్యూహాలే కీలకం
బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో మునుపెన్నడూ లేని ‘దూకుడు’ కనిపించింది. ముఖ్యంగా 2020 జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు గెలుచుకోవడంలో సంజయ్ వ్యూహాలే కీలకం. ఆయన చేసిన పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ వంటి వ్యాఖ్యలు కేడర్‌లో జోష్ నింపడమేకాక సెటిలర్లు, హిందూ ఓటు బ్యాంకును ఏకం చేశాయి. అంతవరకు కేవలం మూడో స్థానానికి పరిమితమైన బీజేపీని, బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యామ్నాయంగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కేవలం 4 స్థానాల నుంచి ఏకంగా 48 స్థానాలకు చేరుకోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఆ ఎన్నికల్లో ఆయన అనుసరించిన వ్యూహాత్మక ఘాటైన విమర్శలు, హిందూత్వ నినాదం పార్టీకి కొత్త ఆక్సిజన్‌ను అందించాయి. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సాధించిన విజయాలు ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలిచాయి. 2023లో పదో తరగతి పరీక్ష పేపర్ల లీక్ కేసులో అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సంజయ్‌ను ఏ-1గా వరంగల్ పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో చూపారు. ఆయనను హనుమకొండ అదాలత్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అంతకుముందు అర్ధరాత్రి కరీంనగర్‌లో అరెస్ట్, తర్వాత బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలింపు, తరువాత హనుమకొండ అదాలత్ లో హాజరుపరచడం, రిమాండ్ విధింపు వరకు పరిస్థితులు వేగంగా మారుతూ వచ్చాయి. దీని వెనుక అప్పటి ముఖ్యమంత్రి కేసీఆరే సూత్రధారి అని బండి తీవ్ర విమర్శలు చేశారు. తదనంతరం ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.
బండి సంజయ్ ప్రయాణం ఒక సంచలనం
కరీంనగర్ గల్లీల్లో కార్పొరేటర్‌గా మొదలై, దేశ రాజధానిలో హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ ప్రయాణం ఒక సంచలనం. ఒక సామాన్య కార్యకర్త తలుచుకుంటే రాజకీయాల్లో ఏ స్థాయికి చేరవచ్చో నిరూపించిన నాయకుడు ఆయన. దూకుడుకు మారుపేరుగా, హిందుత్వ వాదానికి బ్రాండ్ అంబాసిడర్‌గా, తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపిరి పోసిన ధీశాలి. తెలంగాణ రాజకీయ యవనికపై ఒక సామాన్య కార్యకర్త అసాధారణ శక్తిగా ఎదిగిన తీరుకు బండి సంజయ్ ఒక సజీవ సాక్ష్యం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్‌గా రాజకీయ ఓనమాలు దిద్దిన ఆయన నేడు దేశ రాజధానిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. పదేళ్ల క్రితం తెలంగాణలో ఉనికి కోసం పోరాడిన బీజేపీకి, నేడు అధికార పీఠమే లక్ష్యంగా దిశానిర్దేశం చేస్తున్న ‘పవర్ హౌస్’గా ఆయన నిలిచారు. బండి రాజకీయ ప్రస్థానం కేవలం పదవుల పరంపర కాదు. అది ఒక నిరంతర పోరాటం, పక్కా వ్యూహాల సమాహారం.కేవలం మాస్ లీడర్‌గానే కాక వ్యూహకర్తగా కూడా తన ముద్ర వేశారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు వెనుక ఆయన చాణక్యం దాగి ఉంది. తాజాగా 2026 కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడినప్పటికీ చాకచక్యంగా పావులు కదిపి బీజేపీ అభ్యర్థిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా తన సొంత గడ్డపై తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. స్పష్టమైన మెజారిటీ రాకపోయినా స్వతంత్రులను కలుపుకొని, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం విశేషం. కొలగాని శ్రీనివాస్ ను మేయర్ గా కూర్చోబెట్టడం ద్వారా కరీంనగర్ తన సొంత సామ్రాజ్యం అని ఆయన మరోసారి చాటిచెప్పారు. ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ల ఎత్తులను చిత్తు చేస్తూ స్వతంత్రులను కలుపుకొని అధికార పీఠాన్ని దక్కించుకోవడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా దేశ భద్రతా వ్యవహారాల్లో పాలుపంచుకుంటున్న బండి తన నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించడం లేదు. రాజకీయాలు ఎన్నికల వరకే.. అభివృద్ధి శాశ్వతం అనే నినాదంతో ఆయన ముందుకు సాగుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 2.25 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలవడం ద్వారా ప్రజల్లో తనకున్న ఆదరణను ఆయన సుస్థిరం చేసుకున్నారు. నిరంతర పాదయాత్రలు, ప్రజా సంగ్రామ యాత్రల ద్వారా ప్రజలకు చేరువైన ఆయన భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. మొత్తానికి బండి సంజయ్ ప్రయాణం తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. అమిత్ షా వంటి ఉక్కు మనిషి ఆధ్వర్యంలో పనిచేస్తూ పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ, అంతర్గత భద్రత వంటి అంశాలపై దృష్టి సారించారు. సంజయ్ ప్రస్థానం ప్రతి కార్యకర్తకు ఒక స్ఫూర్తి. పోరాటమే ఊపిరిగా, పార్టీ సిద్ధాంతమే ప్రాణంగా ఎదిగిన ఆయన భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో ఇంకా ఏ స్థాయికి చేరుకుంటారో వేచి చూడాలి. బండి రాజకీయ బీజాలు ఆయన 12 ఏండ్ల వయసులోనే పడ్డాయి. ఆర్ఎస్ఎస్‌లో బాల స్వయం సేవక్‌గా చేరిన ఆయన, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఎదిగారు. అనంతరం ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించి విద్యార్థి నాయకుడిగా కరీంనగర్ గడ్డపై తన ముద్ర వేశారు. 1996లో ఎల్ కే అద్వానీ చేపట్టిన రథయాత్రలో 35 రోజుల పాటు పాల్గొనడం ఆయన రాజకీయ పరిణతికి తొలి మెట్టుగా నిలిచింది. బండి రాజకీయ శైలిలో ప్రధానంగా కనిపించేది దూకుడు. ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణలో పెరిగిన ఆయన విద్యార్థి దశలోనే ఏబీవీపీ ద్వారా ప్రజా సమస్యలపై గళమెత్తారు. 2005లో కరీంనగర్ కార్పొరేటర్‌గా గెలిచినప్పటి నుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు. వరుసగా మూడుసార్లు స్థానిక సంస్థల్లో గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటములు ఆయనను కుంగదీయలేదు. ఆ ఓటములే ఆయనను మరింత రాటుదేల్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి అనూహ్య విజయం సాధించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కొత్త శకానికి నాంది పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





