– మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
– సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బీజేపీ ప్రచార సభ
సిర్పూర్ కాగజ్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: అభివృద్ధి, సుపరిపాలన కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిర్పూర్ కాగజ్‌నగర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్సాహమే రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయానికి పునాది అవుతుందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మాట్లాడుతూ ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలలో బీజేపీని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం నిధులను నగరాల సమగ్ర అభివృద్ధికి వినియోగిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశామని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక కీలక అంశాలను అందులో పొందుపరిచామని చెప్పారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవు.. జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని, అలాంటి ప్రభుత్వం ఇప్పుడు మున్సిపాలిటీలను ఎలా అభివృద్ధి చేస్తుంది అని ఆయన ప్రశ్నించారు. ప్రజలపై పన్నుల భారం మోపి ప్రభుత్వం నడపడం ఒక్కటే వారి ఆలోచన అని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి తనను యాదవ్, గౌడ, ముదిరాజ్ అని చెప్పుకుంటున్నారు.. కానీ నిజానికి ఆయన రేవంతుద్దీన్‌లా కన్వర్షన్ చేసుకోవచ్చు గానీ కులాలకు మార్పిడి ఉండదు అని వ్యాఖ్యానించారు. బీసీ కులాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీలేదని, ఏ, బీ, సీ కులాల గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి బీసీలకు చేసిందేమీలేదని అన్నారు. ఎనిమిదిమంది ముస్లింలకు చైర్మన్ పదవులు ఇస్తామని చెప్పారు.. కానీ ఓబీసీలకు మాత్రం న్యాయం చేయలేదన్నారు. రాష్ట్రంలో దేవాలయాలను, దేవాలయ భూములను రక్షించుకోవాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. ‘సేవ్ తెలంగాణ-ఓట్ ఫర్ బీజేపీ’ అన్నదే తమ నినాదమని రామచందర్‌రావు చెప్పారు. ప్రజలు బీఆర్ఎస్‌కు, తర్వాత కాంగ్రెస్‌కి అవకాశం ఇచ్చారు.. ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తు కోసం సుపరిపాలనను అందించే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే జరుగుతున్నాయని రామచందర్‌రావు వివరించారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి రాహువులా, కేసీఆర్-కేటీఆర్ కేతువులా మారి పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలలో బీజేపీ విజయం ఖాయమని స్పష్టంగా తెలుస్తోందన్నారు. సభలో పార్లమెంటు సభ్యుడు గోడెం నాగేష్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





