– అందుకే శబరిమలపై మాట్లాడడం లేదు
– మరోమారు విమర్శలు గుప్పించిన రాహుల్
– కేరళంలో ఉధృత ప్రచారం
తిరువనంతపురం, మార్చి 31: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం ఉధృతం చేశారు. వరుసగా రెండోరోజు ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. అధికార అధికార లెప్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. సిద్దాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో ఎల్డీఎఫ్ జత కట్టిందని ఆరోపించారు. అందువల్లే ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ గెలవాలని మోదీ కోరుకుంటున్నారన్నారు. బీజేపీతో కూడిన ఎల్డీఎఫ్‌కు, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్‌కు మధ్యే ఎన్నికల పోరాటం జరుగుతోందన్నారు. కన్నూరులో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సీపీఎం మాజీ నేతలు వి.ఉన్నికృష్ణన్, టీవీ గోవిందన్‌లు కూడా రాహుల్ ప్రసంగించిన వేదికపై పాల్గొన్నారు. ఈ ఎన్నికలు రెండు సిద్దాంతాలకు మధ్య జరుగుతున్న పోరని, తొలిసారి బీజేపీ-లెప్ట్ ఫ్రంట్ చేతులు కలపడం అంతా చూస్తున్నామని రాహుల్ అన్నారు. బీజేపీతో ఎల్డీఎఫ్ జత కట్టడం ఇష్టంలేకనే ఆ పార్టీలోని కొందరు సీనియర్లు యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని చెప్పారు. లెప్ట్ ఫ్రంట్ ఇంకెంతమాత్రం వామపక్ష పార్టీ కాదని, అతివాద రైట్‌వింగ్ పార్టీ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఎక్కడకు వెళ్లినా ఆలయాలు, మతం గురించి మాట్లాడతారని.. కానీ ఇక్కడకు వచ్చినప్పుడు మాత్రం శబరిమల ఆలయంలో బంగారం తాపడాలు మాయం కావడంపై ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్ ప్రశ్నించారు. రాష్ట్రంలో లెప్ట్ ఫ్రంట్ తిరిగి గెలవాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఆక్కర లేదని అన్నారు. సీపీఎంను బీజేపీ కంట్రోల్ చేస్తోందని, యూడీఎఫ్‌ను మాత్రం కాదని చెప్పారు. తనకు సవాల్ విసరగలిగే సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందనే విషయం మోదీకి బాగా తెలుసునని అన్నారు. మోదీని కాంగ్రెస్ ప్రతిఘటించడం అందరికీ తెలుసునని, కానీ మోదీని కేరళ సీఎం కానీ, కేరళ సీఎంను మోదీ కానీ విమర్శించడం ఎవరూ విని ఉండరని రాహుల్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





