‘స్థానిక’ ఎన్నికల నినాదం బూతులేనా?

– ఏ ప్రభుత్వం వల్ల పంచాయతీలకు నిధులొచ్చాయో చర్చకు సిద్దమా?
– దశాబ్దాల కల రైల్వే మాన్యుఫాక్చర్‌ యూనిట్‌ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది
– కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల కుమ్కక్కు రాజకీయాలు
– జనగామలో బండి సంజయ్‌

జనగామ, ప్రజాతంత్ర, జులై 18: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రజా సమస్యలను, అభివృద్ధిని పక్కనపెట్టి పరస్పరం బూతులు తిట్టుకుంటూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. ఒకాయనేమో ‘అరే హౌలే, రా, బే, చెప్పుతో కొడతా, నీ బొంద అంటూ బూతులు తిడితే ఇంకొకాయనేమో డ్రగ్స్‌, హీరోయిన్‌, బే అని తిట్టుకుంటూ, సవాళ్లు విసురుకుంటూ టీవీల్లో, పేపర్లలో వార్తలకెక్కుతూ న్నారు అని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు తిట్లతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాయోమో అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనగాంలో పార్టీ జిల్లా శాఖ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వర్క్‌ షాప్‌లో పాల్గొనేందుకు వచ్చిన సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీల అభివృద్ధిపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నేతలకు సవాల్‌ చేస్తున్నా.. పంచాయతీలకు ఎవరివల్ల నిధులు వస్తున్నాయి.. ఎవరి వల్ల పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయో చర్చకు సిద్ధమా? మీరే ఏ గ్రామమైనా ఫిక్స్‌ చేయండి. డేట్‌, టైం కూడా మీరే డిసైడ్‌ చేయండి. మేం అక్కడికి వస్తాం. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో, కాంగ్రెస్‌ 19 నెలల పాలనలో ఆ గ్రామంలో ఏ అభివృద్ది జరిగింది? ఎన్ని నిధులు వచ్చాయి? అలాగే నరేంద్రమోదీ 11 ఏళ్ల పాలనలో కేంద్రం ఆ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగంగా చర్చిద్దాం. దమ్ముంటే రెండు పార్టీలు ఈ సవాల్‌ను స్వీకరించి చర్చకు రావాలి అని కోరారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ చేసి గెలిచేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.. మేం అభివృద్ధే మంత్రంగా పోటీ చేయబోతున్నాం.. ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్నాం అని చెప్పారు. కానీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాత్రం ప్రజా సమస్యలను, అభివృద్ధిని పక్కనపెట్టి పరస్పరం తిట్టుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నాయి.. అతి తక్కువ కాలంలో ప్రజాదరణను కోల్పోయిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్‌ పార్టీనే అన్నారు.

మాజీ సర్పంచ్‌లే మా బ్రాండ్‌ అంబాసిడర్లు

స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బ్రాండ్‌ అంబాసిడర్లు మాజీ సర్పంచులే. ఎందుకంటే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పాలనలో పనులు చేసి బిల్లులు రాక అప్పులపాలై బిచ్చమెత్తుకుంటున్నరు. ఆత్మహత్యలపాలవుతున్నారని సంజయ్‌ తెలిపారు. గ్రామాల్లో జరిగే అంతోఇంతో అభివృద్ధి జరుగుతున్నదంటే కేంద్రం ఇస్తున్న నిధులతోనే. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సిబ్బందికి కూడా జీతాలివ్వలేని దుస్థితిలో ఉంది. అందుకే బీజేపీని గెలిపిస్తేనే కేంద్ర నిధులు సక్రమంగా వస్తాయని, గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. అంతా బీజేపీవైపు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు బీజేపీదే అని చెప్పారు. రాష్ట్ర ప్రజల దశాబ్దాల నాటి కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ కలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేయబోతోంది. దీని ద్వారా కోచ్‌ తయారీ రంగంలో తెలంగాణ దేశానికి కేంద్రంగా మారబోతోందని చెప్పారు. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలకు పరిశ్రమల రాకకు ఇది ఊతమిస్తుందని తెలిపారు. కాళేశ్వరం, డ్రగ్స్‌, విద్యుత్‌ కొనుగోళ్లు, ఫాంహౌజ్‌, ఫార్ములా ఈరేస్‌, చేపల, గొర్రెల స్కాంలు జరిగాయని, ఆధారాలున్నాయని చెప్పినా కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. బనకచర్ల విషయంలో రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయి. బనకచర్లపై తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్‌ చేస్తామని బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతుంటే కేంద్రం నిర్వహించిన మీటింగ్‌లో బనకచర్ల ప్రస్తావనే లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారు. ఈ పార్టీల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. జనగాంలో ప్రభుత్వ ఇండ్లను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు 60:40 శాతం చొప్పున పంచుకుంటున్నారట కదా? పేదలకు పూర్తిగా అన్యాయం చేస్తున్నరు. ఆఖరుకు జర్నలిస్టులకు కూడా ఇండ్లు ఇస్తామని ఆశ చూపుతున్నారన్నారు.

రిజర్వేషన్లపై బీజేపీ స్టాండ్‌ క్లియర్‌

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ స్టాండ్‌ వెరీ క్లియర్‌. పూర్తిగా బీసీ బిడ్డలకే 42 శాతం రిజర్వేషన్లకే అందించాలి. ఆ పనిచేస్తే కేంద్రాన్ని ఒప్పించి బిల్లును ఆమోదింపజేసే బాధ్యత మేం తీసుకుంటాం. కానీ కాంగ్రెస్‌ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతూ అందులో 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తోంది. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల వల్ల ముస్లింలు లబ్ది పొందుతున్నారు. ఇంకా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఈ రాష్ట్రంలోని ముస్లింలందరికీ నూటికి నూరు శాతం రిజర్వేషన్లు అందుతాయి. బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.. అందుకే బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే ఒప్పుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *