– కాంగ్రెస్, బీఆరఎస్‌లకు సింగిల్ డిజిట్ సీట్లే
– మూడో స్థానం కోసమే పోటీపడుతున్నాయి
– మజ్లిస్‌కు వాటికంటే ఎక్కువ సీట్లు వచ్చేట్లున్నాయి
– మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించండి
– కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం కాబోతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆ రెండు పార్టీలు మూడో స్థానం కోసమే పోటీపడుతున్నాయని, సర్వే నివేదికలన్నీ ఇదే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల కంటే మజ్లిస్ పార్టీకి 1, 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశముందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూసి కరీంనగర్ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 66మంది అభ్యర్థులతో సంజయ్ రాత్రి పొద్దుపోయాక సమావేశం నిర్వహించి ప్రచార వ్యూహం, ఎన్నికల ఎత్తుగడ వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత విలువైనదని చెప్పిన బండి సంజయ్ అందుకోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి ఓటర్లను కలిసి వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అదే సమయంలో నామినేషన్లు ఉపసంహరించుకున్న బీజేపీ నాయకుల ఇండ్లకు వెళ్లి వాళ్లను కలుపుకుపోవాలని, ప్రచారానికి వచ్చేలా చూడాలని సూచించారు. పగలు, పట్టింపులు ముఖ్యం కాదని, ప్రతి ఒక్కరి మనసు గెలవడంపైనే ఉండాలని హితవు పలికారు. ఎన్నికల్లో గెలుపు వాతావరణం వచ్చేలా చూసుకోవాలని, అతి విశ్వాసంతో కాక నమ్మకంతో గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. ఇప్పటివరకు అందిన సర్వే నివేదికల ప్రకారం బీజేపీకి 35 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సంఖ్యను 50 దాటించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని పార్టీ శ్రేణులతోపాటు రాష్ట్ర ప్రజల దృష్టి కరీంనగర్ కార్పొరేషన్‌పైనే ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాల్సిందేనని చెప్పారు. అందుకోసం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తానని, ఎందాకైనా మీ పక్షాన కొట్లాడతానని హామీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు కరీంనగర్ ఇన్‌చార్జి డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ, సీనియర్ నేతలు మల్లేశం, వాసాల రమేశ్ తదితరులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





