– 3,911 స్థానాల్లో గెలిచింది 6.5 శాతమే
– కేవలం 236 స్థానాల్లోనే విజయం
– రెండు, మూడు జిల్లాల్లోనే ప్రభావం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: రాష్ట్రంలో ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు, మరో ఎనిమిదిమంది ఎంపీలు ఉన్న బీజేపీ పల్లెపోరులో మాత్రం పట్టు కోల్పోయింది. గ్రామ పంచాయతీలకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన సీట్లలో కనీసం సగం కూడా సాధించలేక ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది. తొలి విడతలో దారుణంగా ఓటమిపాలైన బీజేపీ కేవలం 189 పంచాయతీల్లో గెలుపొందింది. రెండో విడతలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు జరిగిన 3,911 స్థానాల్లో కేవలం 236 స్థానాల్లో (6.5 శాతం) మాత్రమే బీజేపీ మద్దతుదారులు విజయం సాధించగలిగారు. ఆదిలాబాద్, మంచిర్యాల మినహా మిగిలిన ఏ జిల్లాలోనూ బీజేపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. రెండు విడతల్లో ఆ పార్టీ కేవలం 435 స్థానాలతో సరిపెట్టుకున్నది. రెండు విడతల్లో స్వతంత్ర అభ్యర్థులు 1,161 స్థానాల్లో గెలుపొందారు. అందులో సగం కూడా బీజేపీకి రాకపోవడం కమలనాథుల దయనీయస్థితికి అద్దంపడుతున్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నియోజకవర్గమైన కరీంనగర్‌తోపాటు ఎంపీ ఈటల గతంలో ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్‌లోనూ బీజేపీ మద్దతుదారులు ఓడిపోవడం చర్చనీయాంశమైంది. మరో ఎంపీ రఘునందన్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్‌లో కనీస పోటీ ఇవ్వకపోవడంతో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకం అయింది. బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, ప్రత్యామ్నాయం తామేనని ఊదరగొట్టే బీజేపీ రాష్ట్ర నేతల మాటలు కేవలం వట్టివేనని రెండు విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 30 శాతానికిపైగా వోట్లు సాధించడం, 8 సీట్లలో గెలుపొందడం గాలివాటమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మున్ముందు రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభావం నామమాత్రమేని పేర్కొంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.