– కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి
– సీఎంకు దిల్లీ వెళ్లడంతోనే సరిపోతోంది..
– పాలనపై దృష్టి పెట్టడంలేదు
– రాష్ట్రాభివృద్ధి మోదీతోనే సాధ్యం
– విజయ్ సంకల్ప్ సమ్మేళనంలో అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17: రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించి ఏ క్షణమైనా ఎన్నికలు జరగొచ్చు.. ఆ ఎన్నికలకు బీజేపీి సిద్ధంగా ఉంది అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. తన అధ్యక్షతన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల విజయ్ సంకల్ప సమ్మేళనం సికింద్రాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ సిద్ధంగా ఉండాలనే సంకల్పంతోనే ఈ సమ్మేళనం నిర్వహించుకున్నామన్నారు. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి సారిగా సుమారు వెయ్యిమంది సర్పంచులు, దాదాపు 10 వేల మంది వార్డు మెంబర్లు, 1200 నుంచి 1500 మధ్య ఉప సర్పంచులను గెలుచుకున్నామని, దీంతో గ్రామీణ ప్రజల్లో కూడా పార్టీకి ఆదరణ వేగంగా పెరుగుతోందని స్పష్టమవుతోందని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రజల్లో పూర్తిగా కనుమరుగైందని, త్వరలో ఆ పార్టీ ముక్కలవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. దోచుకున్న ప్రజా సొమ్మును పంచుకోవడంలోనే వారు నిమగ్నమై ఉన్నారని, ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసి ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లడం – రావడం లేదా బహిరంగ సభలు పెట్టడం తప్ప పాలనపై దృష్టి పెట్టడం లేదన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే అభివృద్ధి జరుగుతోందన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోంది మోదీ ప్రభుత్వమే
గత 11 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని తెలిపారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు, బీబీ నగర్‌లో ఎయిమ్స్, ములుగులో సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు.. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనన్నారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ షాపుల్లో సీఎం ఫోటో మాత్రమే పెట్టి రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోందన్న తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రం దారి మళ్లించిందని ఆరోపించారు. కేంద్రం సమయానికి యూరియాను పంపిస్తుంటే దానిని కూడా కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారన్నారు. ముందు దీన్ని సరిదిద్దండి.. దీనికి దిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదని సీఎంకు హితవు పలికారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, రైతులకు రుణ మాఫీ చేయాలన్నా సీఎం దిల్లీకి వెళ్లాల్సిన పనిలేదు. ఇక్కడ నుంచే చేయవచ్చు అని అన్నారు.
వీబీజీ రామ్ జీ పథకం గత పథకం కంటే మెరుగైనది
గ్రామీణ ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ పథకం పారదర్శకతకు నిదర్శనమని రామచందర్‌రావు తెలిపారు. గత పథకం కంటే మరింత మెరుగైనదని, ఇది గ్రామీణ పేదలకు ఉపాధి హామీతోపాటు జీవనోపాధిని బలోపేతం చేస్తుందని వివరించారు. ఈ పథకంపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందని కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే, పేదలకు ఇండ్లు రావాలంటే, ఆరోగ్య భద్రత కావాలంటే అది కేవలం నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాల ద్వారానే సాధ్యమన్నారు. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజనను ఎందుకు అమలు చేయడం లేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. తాము ప్రజల పక్షాన నిలుస్తాం. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతాం.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడతాం.. అందుకే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీిని గెలిపించాలని కోరుతున్నానన్నారు.
ఇన్‌చార్జిలు విస్తృత ప్రచారం చేయాలి
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇన్‌చార్జిలుగా నియమితులైన వారు విస్తృత ప్రచారం చేసి బీజేపీ జెండా ఎగురవేసేలా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరికొన్ని రోజుల్లో పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. నితిన్ నబీన్ సిద్ధాంతానికి కట్టుబడిన నాయకుడు. విద్యార్థి పరిషత్ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించి, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, అస్సాం రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా పనిచేశారు. త్వరలో ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక ప్రకటన కానుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నితిన్ నియామకం శుభ సందర్భంగా ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తూ బీజేపీ జెండాలను ఎగురవేసి, ఇంటింటకీి వెళ్లి నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంలో నితిన్ మార్గదర్శనంలో బీజేపీి సేవలందిస్తుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని రామచందర్‌రావు సూచించారు. సమ్మేళనంలో కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, పార్టీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనమండలిపక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణా రెడ్డి, రామారావు పాటిల్, సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, వేముల అశోక్, తూళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీ, మాధవి, సీనియర్ నాయకులు గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, బీజేపీ మోర్చా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




