– ఈ ప్రభావం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైనా ఉంటుంది
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులను గెలిపించడంలో కార్యకర్తలు కష్టపడ్డారని, అనేక జిల్లాల్లో కూడా బీజేపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. పార్టీకి మద్దతిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు, గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే రెండు విడతల్లోనూ పార్టీని ఆదరించి, ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో తమకు ఒక్క సర్పంచ్ కూడా లేని జనగాం 2, మహబూబాబాద్ లో 6, భూపాలపల్లిలో 3, సంగారెడ్డిలో 6, వనపర్తిలో 6, నాగర్ కర్నూల్ లో 3 సర్పంచ్ పదవులు గెలిచామని ఆయన తెలిపారు. ఇవాళ వార్డు సభ్యులతోపాటు ఉప సర్పంచ్ అభ్యర్థులు కూడా చాలామంది బీజేపీ మద్దతుతో గెలిచారన్నారు. మొదటి విడత ఎన్నికల్లో 300కు పైగా సర్పంచ్ స్థానాలను గెలిచామని తెలిపారు. రెండో, మూడో విడతలో కూడా బీజేపీకి ఇప్పటికంటే ఎక్కువ స్థానాలు వస్తాయన్నారు. ఈ ప్రభావం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా ఉంటుందన్నారు. గ్రామాల్లో వార్డు వార్డుకూ బీజేపీ వెళ్ళిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు తాము 6000 గెలిచామంటే తాము 4000 గెలిచామని చెప్పుకుంటున్నారని రామచందర్‌రావు ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు అందుతున్నాయంటూ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కోట్లాది రూపాయలు ఇస్తే వాటిని దారి మళ్లించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని విమర్శించారు. గతంలో కేంద్రం నిధులను బీఆర్ఎస్ మళ్ళించినట్లే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోందన్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటవుతున్నాయన్నారు. ఇండి కూటమిలో ఉన్న అఖిలేష్ యాదవ్ కేటీఆర్ ను ఎలా కలుస్తారు.. ఎందుకు పొగుడుకున్నారు అని ప్రశ్నించారు. శత్రువు శత్రువుకి మిత్రుడు.. వీళ్ళకి రాజకీయ ప్రత్యర్ధి బీజేపీ కాబట్టి వాళ్లు కలుస్తున్నారన్నారు. గతంలో స్టాలిన్ పిలిచినప్పుడు కూడా రెండు పార్టీల నేతలు వెళ్లారని గుర్తు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





