ఇపుడు ప్రజల చూపు బీజేపీ వైపు

– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

పెద్దపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 5: రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ క్రమంగా విస్తరిస్తోంది.. ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనను చూశారు.. కాంగ్రెస్‌ పార్టీ ప్రజావ్యతిరేక పాలనను కూడా చూశారు.. ఇప్పుడు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో భాగంగా బీఆర్‌ఎస్‌ నాయకుడు నల్ల మనోహర్‌ రెడ్డి తన అనుచరులతో, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు చెందిన 300 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి రామచందర్‌రావు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేయలేద న్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరంతరం పోరాడితే ఆ పోరాట ఫలితాలను కాంగ్రెస్‌ పార్టీ పొంది అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, మహిళలు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 2024-25 రబీ సీజన్‌లో రాష్ట్రానికి అవసరమైన యూరియా పరిమాణం 9.80 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా కేంద్రం 12.47 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా చేసిందని, అయినా రాష్ట్రంలో ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు చేరుతున్నాయని తెలిపారు. ఎరువుల దుకాణాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేకపోవడం, వ్యవసాయ శాఖ అలసత్వం, బ్లాక్‌ మార్కెట్‌ నిరోధించడంలో విఫలమవడం ఇందుకు ప్రధాన కారణాలని రామచందర్‌రావు అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి దాదాపు రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులను కేంద్రం చేపట్టిందని, ఆగస్టు 2న పీఎం కిసాన్‌ 20వ విడత నిధులుగా దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.20,500 కోట్లు నేరుగా జమ చేసిందని ఆయన చెప్పారు. ఎన్టీపీసీ ద్వారా 2600 మెగావాట్లతోపాటు ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్ల ద్వారా 4310 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని, తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తిచేసిన ఘనత కూడా మోదీ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో పెద్దపల్లి జిల్లాను వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పిందని, కానీ గత 19 నెలల పాలనలో ఈ జిల్లాను పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున తాత్కాలికంగా రెండు విడతల్లో కేవలం రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ విడుదల చేసి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింల రిజర్వేషన్లను చేర్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలంటే 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని స్పష్టం చేశారు. వారికి రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేకనే దిల్లీిలో ధర్నాల పేరుతో నాటకాలాడుతోందని ధ్వజమెత్తారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త, ప్రతి బూత్‌స్థాయి నాయకుడు ఐక్యతతో కృషి చేయాలని రామచందర్‌ రావు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *