– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 31: మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబయిలోని ఎన్‌ఐఏ కోర్టు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. అప్పట్లో దేశ భద్రతను, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందన్నారు. కాగా, తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా స్వాగతిస్తున్నామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ మూడు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పడం మంచి పరిణామమంటూ కోర్టు తీర్పునకనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. గతంలో రాజీవ్‌గాంధీ యాంటీ డెఫెక్షన్ చట్టంలో మార్పులు చేశారని, కానీ ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ గతంలో బీఆర్‌ఎస్ మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని రామచందర్‌రావు ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర వాస్తవంగా జనహితమా లేదా ప్రజలను మోసం చేయడమా అనేది ఆ పార్టీ స్పష్టం చేయాలన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, మహిళలు వంటి వర్గాలకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందంటూ ఇదెలా జనహితమవుతుంది అని ఆయన ప్రశ్నించారు. హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, అప్పుడే వారికి పాదయాత్ర చేసే నైతిక హక్కు ఉంటుందని అన్నారు.



