జిల్లాలో బీజేపీ శక్తిని చాటాలి

– కూసుమంచిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 29: పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా శక్తిని చాటి భారతీయ జనతా పార్టీ విజయాన్ని సాధించాలని ఖమ్మం జిల్లా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కూసుమంచి వచ్చిన ఆయన స్థానిక పురాతన స్వయంభూ శివాలయంలో పూజలు చేసి పర్యటన ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు బిజెపి వైపు ఆలోచిస్తున్నారని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు చాలామంది కార్యకర్తలు బిజెపిలో చేరారన్నారు. కాగా, ఈ జిల్లాతో తనకు ఆత్మీయ సంబంధం ఉందని, చిన్నప్పుడు తాను పెరిగిన ప్రదేశమని, తమ మేనత్త ఊరు ఇదేనని చెప్పారు. అలాంటి ఈ ఊర్లోని శివాలయంలో పూజలు నిర్వహించి జిల్లా పర్యటన ప్రారంభిచానన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ జిల్లాకు మంచి ప్రాధాన్యత ఉందని, ఇప్పటి ప్రభుత్వంలో కూడా ం ముగ్గురు మంత్రులు ఉన్నారని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీజేపీ నాయకులపై రాజకీయ కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టిందని, ఒక కార్యకర్త ఆత్మహత్య కూడా చేసుకున్న దారుణ పరిస్థితి ఉందని విమర్శించారు. అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమంటూ రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా ఖమ్మం జిల్లా ప్రజలు బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని రామచందర్‌రావు కోరారు. ఇక్కడ పెద్ద ఎత్తున స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *