కార్యాలయం వద్ద బీజేపీ నేతల ఆందోళన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: నగరంలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉదిక్త్ర వాతావరణం నెలకొంది. నగర సమస్యలపై అధికారులను నిలదీసేందుకు బల్దియా కార్యాలయానికి భారీగా తరలివచ్చిన బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. తరలివచ్చారు. వీధి దీపాలు, రోడ్ల సమస్యలతో పాటు డివిజన్‌లోని సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ నిరసనకు దిగింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కమిషనర్ చాంబర్‌లోకి వెళ్లేందుకు యత్నించిన కార్పొరేటర్లు, బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. రామ్‌నగర్ కార్పొరేటర్లు గోడలు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. కమిషనర్‌ను కలవకుండా పోలీసులు అడ్డుకోవడంతో గేట్ ముందు కూర్చుని బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. హైదరాబాద్‌లో వీధి దీపాలు, రోడ్లు సరిగా లేకపోవడం, నాలాల పూడిక తీయకపోవడం వంటి అనేక సమస్యలు నగర వాసులను వెంటాడుతున్నాయని, తక్షణమే ఆ సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున బీజేపీ నేతలు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.
బీజేపీ కార్యాలయం ముందు ధర్నా చేయండి: మంత్రి పొన్నం
బీజేపీ కార్పొరేటర్ల ధర్నాపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. నిధుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నిలదీయాలన్నారు. జీహెచ్‌ఎంసీ అభివృద్ధిపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన ఖండిరచారు. ఈ విషయమై మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ నేతలు ధర్నా చేయాల్సింది జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు కాదు.. హైదరాబాద్ నగరం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని మండిపడ్డారు. నగర అభివృద్ధికి కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా తెచ్చేందుకు ప్రయత్నించకుండా బీజేపీ నాయకులు రాజకీయ స్టంట్లు వేయడం సరికాదని విమర్శించారు. నగర అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా కేంద్ర ప్రభుత్వం మారిందని, దీనికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వైఫల్యమే కారణమని తెలిపారు. జీహెచ్‌ఎంసీ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఈ విధమైన రాజకీయాలు చేయడం కన్నా, కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తే తాము కూడా వస్తామని మంత్రి చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి అందరం కలిసి నిధులు తీసుకురావాలని మంత్రి పొన్నం అంటూ ఈ విషయాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు.




