విజయ సంకల్పంతో ముందుకు సాగాలి

పార్టీ శ్రేణులకు రామచందర్‌రావు దిశానిర్దేశం

ఘట్‌కేసర్‌, ప్రజాతంత్ర, జులై 15: స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచేలా విజయ సంకల్పంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఘట్‌కేసర్‌లోని అవుషాపూర్‌లో పార్టీ రాష్ట్రస్థాయి కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను గురించి దిశానిర్దేశం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నల్లగొండ, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో మొదటగా పర్యటించానని, ఈ పర్యటనలో వివిధ వర్గాల ప్రజలను కలిశానని, గ్రామాల్లో బీజేపీి బలం పెరుగుతోందని, రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. గతంలో పార్టీకి ఒక్క ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారన్నారు. ప్రతి ఎన్నికలో బీజేపీి ఓటు శాతం, ప్రాతినిధ్యం స్థిరంగా పెరుగుతోందని తెలిపారు. కార్యకర్తలు కదలాలి, నాయకులు ముందుకు రావాలి, అందరం కలిసిమెలిసి ముందుకు నడవాలి అని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు అందులో 10 శాతం మతపరమైన రిజర్వేషన్లను కలపాలని చూస్తోందని, ఇది బీసీలకు వ్యతిరేకమైన చర్య అని ఆయన చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో మతపరమైన 4 శాతం రిజర్వేషన్లను బీజేపీ గతంలోనే వ్యతిరేకించిందని, కానీ కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఒక్క ప్రాంతానికి పరిమితమవకుండా యావత్‌ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఓటు శాతం పెరుగుతోందని, ఇది మరింత పెరిగేలా బలమైన విశ్వాసంతో మనమంతా ముందుకు సాగాలని రామచందర్‌రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *