– తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
– పాతికేళ్లుగా అందుకోసం పోరాడుతున్నాం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ విమోచనం కోసం పోరాడిన అనేకమంది పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు హైదరాబాద్ సంస్థానంలో 1948 సెప్టెంబర్ 17 వరకు స్వాతంత్య్రం రాలేదని, ఆ రోజు ఆపరేషన్ పోలో ద్వారా నియంత నిజాంకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో చరిత్రాత్మక పోలీస్ యాక్షన్ ద్వారా తెలంగాణను భారతదేశంలో అంతర్భాగంగా చేసుకున్నామని తెలిపారు. ఈ విజయం వెనుక అనేకమంది త్యాగాలు ఉన్నాయని, ఈ చరిత్ర మనందరికీ గుర్తుగా నిలిచిపోవాలని అన్నారు. తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని పాతికేళ్లుగా మన బీజేపీ పోరాడుతోందని తెలిపారు. పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా పోలీస్ యాక్షన్ జరపకపోతే ఈ ప్రాంతం పాకిస్తాన్ లేదా మరో స్వతంత్ర దేశంగా ఉండే పరిస్థితి ఉండేదన్నారు. పోరాటయోధుల త్యాగాన్ని మర్చిపోకుండా, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ముక్తి దివస్‌గా అధికారికంగా వేడుకలు జరుపుకుంటుండగా తెలంగాణలో గతంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రయోజనార్థం మాత్రమే సెప్టెంబరు 17ను రాజకీయ కార్యక్రమాలుగా నిర్వహిస్తూ అధికారికంగా జరుపుకోవడాన్ని వదిలేసిందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రేరణతో హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారన్నారు. కేంద్ర బలగాలు కూడా సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను మూడేళ్లుగా నిర్వహిస్తున్నాయన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన విమోచన దినోత్సవ వేడుకలలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించారన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో, అవినీతిరహింత, సుపరిపాలనతో భారత్ దేశం వికసిత్ భారత్‌గా ఎదుగుతోందన్నారు. ఈరోజు విశ్వకర్మ దినోత్సవం కూడా కావడంతో దేశ నిర్మాణం కోసం కృషి చేస్తున్న శ్రామికుల సేవలను గుర్తుచేసుకుంటూ విశ్వకర్మ మహర్షిని స్మరించుకుంటున్నామన్నారు. ఇన్ని కార్యక్రమాల మధ్య కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకునేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ముందుకొచ్చి భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్‌రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, బిజెపి తమిళనాడు, కర్ణాటకల ఇన్‌చార్జి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





