బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి దక్షిణాది మహిళ నేత ?

 ట్రేండింగ్ లో పురంధేశ్వరి పేరు

బీజేపీ జాతీయ స్థాయిలో ఓ కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న జేపీ నడ్డా పదవీ కాలాన్ని గత ఏడాది పొడిగించినా, ఇప్పుడా స్థానం మళ్లీ ఖాలీ కావొచ్చని ఊహాగానాలు ..!. ముఖ్యంగా ఈసారి పార్టీ అధినాయకత్వ బాధ్యతలు ఒక మహిళ నేతకు అప్పగించే యోచన బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది.

చర్చ లో ముగ్గురు మహిళా నాయకుల పేర్లు

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ముగ్గురు ప్రముఖ మహిళా నాయకుల పేర్లు ఈ పదవికి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

  1. దగ్గుబాటి పురంధేశ్వరి – రాజమండ్రి నుండి ఎంపీగా ఎన్నికైన ఆమె, బీజేపీలో సీనియర్ స్థాయి నేత. బిజెపిలో ఏపీ శాఖకు అధ్యక్షురాలిగా కూడా సేవలందించారు. కేంద్ర మంత్రిగా గతంలో పనిచేసిన అనుభవం ఉంది. రాజకీయంగా విశాలమైన అనుభవంతో పాటు ఆమె కుటుంబ నేపథ్యం కూడా కలిసొచ్చే అంశం  దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు  ఎన్ టి రామారావు  కుమార్తెగా ఆమెకు తెలుగువారిలో విశేష గుర్తింపు ఉంది. పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడ గల మంచి వక్త.
  2. నిర్మలా సీతారామన్ – ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌కు బీజేపీలో బలమైన పట్టుదల, నియంత్రణ, పరిపక్వత ఉన్న నేతగా గుర్తింపు ఉంది. తమిళనాడు నుండి వొచ్చిన ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికీ, ఎన్నికల రాజకీయం లో అనుభవం కొద్దిగా తక్కువ అన్న అభిప్రాయం ఉంది .
  3. వనతి శ్రీనివాసన్ – తమిళనాడులో కోయంబత్తూర్ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వనతి, లాయర్‌గా తన కెరీర్ ప్రారంభించి బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆమె అభ్యాసం, సామాజిక విభాగాల్లో చురుకుగా ఉండటం బలంగా ఉన్నా, జాతీయ స్థాయిలో అనుభవం పరంగా ఆమె ఇంకా ఎదగాల్సి ఉంది.

పురంధేశ్వరి  ఎందుకు ?

పురంధేశ్వరి  ఈ రేసులో ముందు కు ప్రత్యేకించి మూడు కారణాలు :

  1. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన హోదా – పార్టీకి దక్షిణ భారతంలో బలాన్ని పెంచాలనుకుంటున్న బీజేపీకి, పురంధేశ్వరి లాంటి నేత అవసరం. ఆమె తెలుగు భాషా ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నేత.
  2. రాజకీయ అనుభవం – యూపీఏ హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీలోకి వలస వొచ్చినా, ఆమెకి పాలకపక్ష, ప్రతిపక్ష అనుభవం రెండూ ఉన్నాయి.
  3. కుటుంబ నేపథ్యం – ఎన్టీఆర్ వారసురాలిగా ఆమెకు సంప్రదాయిక వోటు బ్యాంకు ఆకర్షించే సామర్థ్యం ఉంది. దీని ద్వారా బీజేపీకి దక్షిణ రాష్ట్రాల్లో – ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో – మరింత ప్రభావం కలిగించే  అంచనాలు ఉన్నాయి.

బీజేపీ లక్ష్యం – దక్షిణ భారత దిశగా వ్యూహాత్మక అడుగు

ఇటీవలి కాలంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే వొచ్చే ఎన్నికలలో ఈ ప్రాంతాల్లో పటిష్టంగా నిలవాలంటే ఒక దక్షిణ భారతీయ మహిళ నేతను జాతీయ అధ్యక్ష పదవిలోకి తీసుకురావడమే సరైన వ్యూహమని విశ్లేషకుల అభిప్రాయం. జేపీ నడ్డా తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవిని మహిళ నేతే చేపట్టబోతుందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. అందులోనూ దగ్గుబాటి పురంధేశ్వరి పేరు ప్రబలంగా వినిపిస్తోంది. ఇది అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే కానీ, పితృస్వామ్య పార్టీ,మహిళా ప్రాధాన్యత లేని పార్టీ అన్న ఆరోపణలున్న   బీజేపీలో ఓ పెద్ద మార్పుకు నాంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ జాతీయ నాయకత్వంలో మార్పులు చేయబోతోందన్న అంచనాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా, తమిళ భాషపై మంచి పట్టు కలిగిన దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ అధ్యక్షురాలిగా నియమించాలన్న యోచన వెనుక వ్యూహాత్మక ఆలోచనలు ఉన్నాయి.

భాషా సామర్థ్యం – ప్రధాన ఆయుధం

పురంధేశ్వరి తమిళ  భాషను అనర్గళంగా మాట్లాడగలగడం చాలా ముఖ్యమైన అంశం. ఇది తమిళ ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలను కలిగించినా, బీజేపీ అభ్యర్థులపై నమ్మకాన్ని పెంచగలదు. గతంలో పలువురు హిందీ మూలభాషా నాయకులు తమిళ ప్రజలకు దూరంగా అనిపించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి పర్యవేక్షణల మధ్య, ఒక దక్షిణాది మహిళా నాయకురాలు — అది కూడా తమిళం  మాట్లాడగలిగే నేత — బీజేపీకి స్థానిక స్థాయిలో ఆదరణ లభించే అవకాశం ఉంది. పురంధేశ్వరికి తెలుగు,తమిళం,కన్నడ, హిందీ,ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.

ద్రావిడ రాజకీయాలలో బీజేపీకి ఎదురుదెబ్బలు

తమిళనాడు రాజకీయాలు ఎప్పటి నుంచో ద్రావిడ ఆధిపత్యంలో కొనసాగుతున్నాయి. ఆ రాజకీయ సాంప్రదాయంలో బీజేపీకి స్థానం సంపాదించడం సవాలే. ఇప్పటివరకు బీజేపీ అక్కడ పూర్తి స్థాయిలో పాతుకోలేకపోయింది. AIADMK వంటి మిత్రపక్షాలపై ఆధారపడుతున్న బీజేపీ, తన స్వంత బలం పెంచే దిశగా పురోగమించాలంటే, సంస్కృతి మరియు భాషాపరమైన అనుసంధానం తప్పనిసరి. పురంధేశ్వరి సాదాసీదా వ్యవహారశైలితో, ప్రజల తో సత్సంబంధాలు  కలిగి ఉండే నేత. ఆమె తండ్రి  ఎన్టీఆర్ తెలుగువారికి ఎంత గౌరవప్రదమైన నాయకుడో, ఆమె సౌమ్యత కూడా అదే స్థాయిలో చెన్నై, మధురై, తంజావూరు వంటి ప్రాంతాల్లో మంచి అభిప్రాయాన్ని కలిగించగలదు. పాలనా అనుభవం, దక్షిణ రాష్ట్రాల ఆకర్షణ బీజేపీకి ప్రస్తుతం అత్యవసరం – దక్షిణ రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని పెంచడం. కర్ణాటకను మినహాయిస్తే, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ స్థాయిలోనే వోటు బ్యాంకు ఉంది. పురంధేశ్వరి వంటి నేతను జాతీయ స్థాయికి తీసుకురావడం ద్వారా, పార్టీ దక్షిణ భారత్ ప్రజలల్లో — “ఇది ఉత్తరాది పార్టీ కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ” అన్న సందేశం బలపడుతుంది. రాబోయే  తమిళనాడు ఎన్నికలు బీజేపీకి దక్షిణ భారత వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన దశ. ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురంధేశ్వరి వంటి తమిళం  మాట్లాడగల, అనుభవం కలిగిన దక్షిణాది మహిళా నేతను జాతీయ అధ్యక్షురాలిగా ఎంపిక చేయడం, భాషా రాజకీయాల్లో ఓ పైచేయి సాధించే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

విమర్శ 

గత వారం తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల పార్టీ అధ్యక్ష పదవుల ఎన్నికలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి అధ్యక్షురాలిగా  పురంధేశ్వరి కి రెండవ సారి కొనసాగే అవకాశం ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ ..పార్టీ అధ్యక్షురాలిగా ఉంటూ మిత్రపక్షం తెలుగు దేశం కు పూర్తి సహాయ సహకారాలు అందించారన్న అనుమానం తో రెండోసారి అధ్యక్షురాలిగా అవకాశం కోల్పోయారని ..పార్టీ మిత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ కి పూర్తి విధేయుడిగా ఉన్నంత కాలం ఆంధ్ర ప్రదేశ్ లో తమ పార్టీ ఎదుగుదలకు ధోకా లేదనీ ..పురంధేశ్వరి లాంటి వారి సేవలు అవసరం లేదన్న ఆలోచనలో ఉన్న బిజెపి అగ్రనాయకత్వం ..పురందేశ్వరిని జాతీయ అధ్యక్షురాలిగా ఎలా అంగీకరిస్తారని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *