‘వికసిత్ తెలంగాణ – బిజెపి సంకల్ప పత్రం’ విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రచారం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ‘వికసిత్ తెలంగాణ – బిజెపి సంకల్ప పత్రం 2026’ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు శుక్రవారం ఆవిష్కరించారు. మున్సిపాలిటీల్లో బీజేపి గెలిచిన వెంటనే అమలు చేయాల్సిన కీలక హామీలను అందులో  పొందుపరిచారు. అవినీతి రహిత పాలన, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులను పూర్తిస్థాయిలో ప్రజల అభివృద్ధికే వినియోగించడం, ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా సమర్థవంతమైన పాలనా వ్యవస్థను అమలు చేయడం ప్రధాన లక్ష్యమని రామచందర్ రావు  తెలిపారు. మున్సిపాలిటీలలో ఎలాంటి అవినీతికి తావుండదని, ప్రభుత్వ లేదా మున్సిపల్ భూముల ఆక్రమణలు, నిధుల మళ్లింపుకు (డైవర్షన్) ఎలాంటి అవకాశం ఉండదన్నారు. పార్టీకి చెందినవారు గానీ, అధికారులు గానీ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేనిఫెస్టోలో యువత కేంద్రంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, జాబ్ ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.  సీనియర్ సిటిజన్స్, యువతకు అనుకూలంగా వాకింగ్ ట్రాక్స్, ఆధునిక సదుపాయాలతో కూడిన పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కొన్ని పార్కులను యూటిలిటీ పార్కులుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు వంటి అన్ని సౌకర్యాలను అత్యున్నత ప్రమాణాలతో అందించడమే ప్రధానంగా తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రభుత్వ భూములు, మున్సిపల్ భూముల ఆక్రమణలను అడ్డుకుంటామని, కబ్జాలకు పాల్పడిన వాళ్లెవరైనా సరే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించి బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రామగుండంలో అభ్యర్థిని బెదిరించి విత్‌డ్రా చేయించిన ఘటన, మంచిర్యాలలో కార్యకర్తల ఇళ్లపై దాడులు జరిగిన విషయాలను ప్రస్తావించారు. కాంగ్రెస్, బీఆరఎస్ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలపై ప్రస్తావిస్తూ, అవినీతి, నిధుల దుర్వినియోగంతో రాష్ట్ర అభివృద్ధి కుటుపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టో కేవలం ఒక పత్రం కాదు. నగరాలు, పట్టణాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలు నెలకొల్పే కార్యాచరణ ప్రణాళిక అని చెప్పారు. ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, నగరాలు, పట్టణాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు మద్దతు తెలిపాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. బీజేపి మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సహ ఇన్‌చార్జులు అశోక్ పర్ణామి, రేఖా శర్మ, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్, పార్టీ సీనియర్ నాయకులు జి.వెంకట్ రెడ్డి, కప్పర ప్రసాద్, సిహెచ్.విఠల్ , తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *