– మానుకోటలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
మహబూబాబాద్, ప్రజాతంత్ర, జులై 30: ఇది గతంలో చెప్పుకునే మానుకోట కాదు.. ఇప్పుడు బీజేపీ మానుకోటగా మారింది.. త్వరలో బీజేపీ అడ్డాగా మారుతుంది.. వీరభద్రస్వామి ఆశీర్వాదం, సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదం బీజేపీకి ఉన్నాయి అని పార్టీ రాష్ట్ర అధక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. మానుకోటలో జరిగిన కార్యకర్తల విసృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు కురవి వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం నుండి మానుకోట వరకు జరిగిన తన పర్యటనలో ప్రజల మనసుల్లో బీజేపీపై ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపించిందన్నారు. గతంలో ఇక్కడ బీజేపీ ఎక్కడుంది అని అన్నవాళ్లే ఇప్పుడు బీజేపీ బలం పెరిగిందని చెబుతున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్షిణ తెలంగాణ ప్రాంతం నుండి ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని, అందులో మానుకోట జిల్లా పరిషత్ గెలుపు ఖాయమని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరే రేవంత్ రెడ్డి కూడా అదే రాజకీయాలను కొనసాగిస్తున్నారంటూ 42 శాతం బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఇస్తే బీజేపీ వ్యతిరేకిస్తుందని అన్నారు. మత ఆధారిత రిజర్వేషన్లను రాజ్యాంగ విరుద్ధమంటూ కాంగ్రెస్ పార్టీ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పనిచేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రైతు బంధు పథకాన్ని నిలిపేసింది.. రైతు భరోసా కింద రూ.15 వేల చొప్పున ఇస్తామని తర్వాత హామీని విస్మరించింది. జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలియదు.. నిరుద్యోగ భృతి లేదు.. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం లేదు.. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు సమయానికి ఇవ్వడం లేదు.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు ఇప్పటికీ పెండిరగ్‌లో ఉన్నాయి అని తెలిపారు. గతంలో సోనియా గాంధీని తీవ్రంగా విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజా వ్యతిరేక విధానాల పార్టీ అని, గతంలో ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించారు.. ఇప్పుడు కాంగ్రెస్‌ను తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని రామచందర్‌రావు చెప్పారు. ప్రతీ బీజేపీ నాయకుడు, కార్యకర్త ప్రజల మధ్యకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.



