హామీల విష‌యంలో వంచిస్తున్న కాంగ్రెస్‌

– రియ‌ల్ ఎస్టేట్ లాబీల‌కు భూములు ధారాద‌త్తం
– రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు ఫెయిల్‌
– కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన ఉద్య‌మం
– బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద్ర‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు ఎన్.రామ‌చంద్ర‌రావు అన్నారు. ఇందిరాపార్క్ వ‌ద్ద‌ బీజేపీ ఆధ్వ‌ర్యంలో ఆదివారం నిర్వ‌హించిన మ‌హా ధ‌ర్నాలో ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భూములను వేలం వేసే పాలసీతో ముందుకు సాగుతోంద‌ని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లగ‌చర్ల వంటి ప్రాంతాల్లో ఫార్మా సిటీ పేరిట రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నించ‌గా రైతుల తిరుగుబాటుతో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఘోరం- ఇండస్ట్రియల్ భూములను భారీస్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు ధారాదత్తం చేస్తోంద‌న్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించింది. కానీ ఒక్క గ్యారంటీ… ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయడంలేదు? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు? రిటైర్డ్ ఉద్యోగులకు తమ హక్కుగా పొందాల్సిన ప్రయోజనాలను ఎందుకు ఇవ్వడం లేదు? యువతకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగ భృతి ఏమైంది? రైతులకు రైతు భరోసా కింద రూ.15,000 ఎందుకు ఇవ్వడం లేదు? మహిళలకు రూ.2,500 ఆర్థిక భరోసా ఏదంటూ ప్ర‌శ్న‌లు సంధించారు. ఒక వైపు రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియాలకు అప్పగించారు. గత బీఆర్ఎస్ పాలనలో “సీఎం అండ్ సన్” మోడల్ ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన “సీఎం అండ్ బ్రదర్స్” మోడల్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు  కమీషన్ల ప్రభుత్వం, కాంట్రాక్టర్ల ప్రభుత్వంగా చూస్తున్నార‌న్నారు. కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు ఒరిగింది శూన్యం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుంది? ఇది తెలంగాణ రైజింగ్ కాదు… తెలంగాణ సింకింగ్. కాంగ్రెస్ కేవలం మత రాజకీయాలు మాత్రమే చేస్తోంది. హిందువుల దేవీదేవతలను పదేపదే అవమానిస్తోంది. కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది. హిందువులకు మూడు కోట్ల దేవుళ్లు ఉన్నారని ఎగతాళి చేసే కాంగ్రెస్ నాయకులకు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలు- ఈ ముగ్గురే దేవుళ్లు! జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే ముస్లింలు.. ముస్లింలంటే కాంగ్రెస్ అని స్పష్టంగా చెప్పారు. అదే హిందువులపై కాంగ్రెస్ తీరును బయటపెట్టింది. అందుకే హిందువులను, దేవతలను రేవంత్-ఉద్దీన్ అవమానపరుస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచింది కాంగ్రెస్ కాదు.. మజ్లిస్ పార్టీ. రాష్ట్రంలో దేవాలయాల భూములను ఆక్రమిస్తుంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. మరోవైపు గోసేవకులు, గోరక్షకులపై తుపాకీ కాల్పులు జరిగినా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఇది అత్యంత దారుణం. రాష్ట్రంలో ఎడ్యుకేషన్, లా, హోం ఈ కీలక శాఖలన్నీ సీఎం రేవంత్ దగ్గరే ఉన్నాయి. కానీ ఎడ్యుకేషన్ నిల్.. లా అండ్ ఆర్డర్ నిల్… శాంతిభద్రతలు పూర్తిగా ఫెయిల్ అంటూ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌లో బాబ్రీ మసీదు కడతామంటూ మాట్లాడే వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిపోషిస్తోంది. బాబ్రీ మసీదు ఇక్కడ కడతామని వాగుతున్న వారి గోరీని ఇక్కడ కడతామని హెచ్చరిస్తున్నాం. దేశంలో మోదీ ప్రభుత్వం నక్సలిజాన్ని అంతం చేస్తూ నక్సలైట్ ముక్త్ భారత్ వైపు తీసుకుపోతుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ నక్సలైట్లకు ఆశ్రయం ఇస్తోంది, పెంచిపోషిస్తోంది. బిజెపి అధికారంలోకి రాగానే అర్బన్ నక్సలైట్లను పూర్తిగా అంతం చేస్తాం. ఎంతోమంది ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులు నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. మోదీ ప్రభుత్వం నక్సలిజాన్ని నిర్మూలిస్తుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తోంది.. ఇది దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ “కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసింది?” అని అడుగుతోంది. వారికి చెబుతున్నాం- జాతీయ రహదారుల విస్తరణ, బీబీనగర్ ఏఐఐఎంఎస్‌, వందేభారత్ రైళ్లు, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, హైదరాబాద్ ఏరోస్పేస్ రంగం అభివృద్ధి, పేదలకు ఉచిత బియ్యం – ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం చేసినవే. అనేక పరిశ్రమలను తెలంగాణకు తెచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయకపోయినా బిజెపిని, మోదీ ప్రభుత్వాన్ని నిందించడం మాత్రమే చేసింది. అందుకే బీఆర్ఎస్ ను ప్రజలు ఇంటికి పంపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అదే దారిలో వెళ్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను కూడా ప్రజలు తిరస్కరిస్తారు. కేవలం రియల్ ఎస్టేట్ లాభాల కోసం హిల్ట్ పాలసీ తీసుకురావడమంటే  అవినీతికి తెరదీయడమే. మూసీ బ్యూటిఫికేషన్ మీద మాకు వ్యతిరేకత లేదు. కానీ ఆ ప్రాజెక్టు డీపీఆర్  ఎక్కడ? ప్రజలకు ఎందుకు చూపడం లేదు? కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ శూన్యం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కక్షపూరితంగా టార్గెట్ చేస్తోంది. తెలంగాణ విద్యార్థులు, మహిళలు, యువత… కాంగ్రెస్ మోసాలను బయటపెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి చేస్తున్న ఈ మహా ధర్నా మహా ధర్మయుద్ధంగా మారుతుంద‌న్నారు. మన హిందూ దేవతలను అవమానించే, యువత భవిష్యత్తును తాకట్టు పెట్టే, మహిళల రక్షణను కాలరాసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో ఇంకా ఎందుకు కొనసాగించాలా అనే ప్రశ్న తెలంగాణ ప్రజల్లో మెదులుతోంది. ప్రస్తుతం గ్రామాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిలబడే సర్పంచ్ అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎదురుతిరిగితే హౌస్ అరెస్టులు, జైలుకు తరలింపులు—ఇవి కాంగ్రెస్ నిరంకుశ పాలన ఉదాహరణలు. తెలంగాణ ప్రజలారా .. ఈ మహా ధర్నాతో పాటు ప్రజా ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా కొనసాగిద్దాం. తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని తీసుకురావాలి. తెలంగాణ ప్రజలు గతంలో బీఆర్ఎస్ నియంతృత్వ పాలన చూశారు.. ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా వీఆర్ ఎస్‌ లో ఉంది. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన ప్రజావ్యతిరేకత వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనను చూసారు. ఇక రాబోయే రోజుల్లో బిజెపికి ఒక్క అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నా. బిజెపి వర్కింగ్ హార్డ్. ఇది టీమ్ బిజెపి. నాయకులందరి సమష్టి నాయకత్వంతో బిజెపి ముందుకు సాగుతోంది… బిజెపి అధికారంలోకి వస్తుంద‌ని జోస్యం చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *