– ప్రజా పాలన పేరుతో ఉత్సవాలు నిర్వహించడం తగదు
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: భారత్‌లో తెలంగాణ విలీనం కాకుంటే మరో పాకిస్తాన్, మరో శ్రీలంక, మరో బంగ్లాదేశ్‌లా మారి ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజjయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని చెప్పారు. ఇంతటి చరిత్ర కలిగినందునే విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ప్రజా పాలన పేరుతో ఉత్సవాలు నిర్వహించడం సరికాదని, దానికంటే తెలంగాణ ప్రజా వంచక పాలన దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ పోలీస్‌్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరిగే సమయంలో ఆ పోరాటాలను గుర్తించి తెలంగాణకనుకూలంగా నిర్ణయం తీసుకుని పార్లమెంట్‌లో బిల్లుకు ఆమోదం తెలపడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి రాజ్‌నాథ్ సింగ్ అని చెప్పారు. నాటి బలిదానాలకు, పోరాటాలను భావితరాలకు చెప్పి త్యాగధనులకు సరైన గుర్తింపునివ్వాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకునే హక్కు ఏ పార్టీకైనా ఉందంటే అది బీజేపీ ఒక్కకే ఉందన్నారు. విమోచనం కోసం మొదటిసారి గొంతెత్తిన పార్టీ కూడా బీజేపీయేనన్నారు. అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏమిటో ప్రజలకు చెప్పాలని రాష్ట్ర గత, ప్రస్తుత పాలకులను సంజయ్ నిలదీశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గల్లీగల్లీలో అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కాగా, ఈ మహత్తరమైన నేటి రోజు విశ్వకర్మ జయంతి కూడా. కార్మికులు, శిల్పులు, వడ్రంగులు, ఇంజనీర్లు ఇలా చేతివృత్తులవారు విశ్వకర్మ వారుసులేనని, అందుకే దేశవ్యాప్తంగా విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నామని చెప్పారు. అలాగే ప్రధాని మోదీ పుట్టిన రోజుకూడా ఈరోజే కావడం మనందరికీ సంతోషాన్ని పంచే రోజు అని చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టాలను, బాధలను అర్ధం చేసుకుని అడుగడుగునా అండగా నిలుస్తూ పెద్ద దిక్కుగా నిలుస్తున్న మోదీకి రాష్ట్ర ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





