భవిష్యత్ తెలంగాణ బీజేపీదే

– పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు రామచందర్‌రావు
– కరీంనగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ బీజేపీలో చేరిక
– మేయర్ పీఠం సాధించిన పార్టీ నాయకులకు అభినందనలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నదని, మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయమే దీనికి నిదర్శనమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. కరీంనగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్, విద్యావేత్త కొమురయ్య బీజేపీలో గురువారం చేరగా ఆయనకు రామచందర్‌రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా కరీంనగర్‌లో సొంతంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నందుకు కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్‌ని అభినందిస్తున్నానన్నారు. ఆయనతోపాటు కృషి చేసిన సునీల్‌రావును, ఎన్నికల ఇన్‌చార్జి మనోహర్ రెడ్డిని, మిగతా సభ్యులకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ తెలంగాణకు గుండెకాయ వంటిది.. ఈ ఉద్యమాల గడ్డపై మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమంటే భవిష్యత్ తెలంగాణ బీజేపీదే అని అర్ధం చేసుకోవాలని రామచందర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది మేధావులు రోజూ తనతో మాట్లాడుతున్నారని, త్వరలో బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు.

పరిపాలనను గాలికి వదిలేసిన‌ ముఖ్యమంత్రి 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలు, చిట్‌చాట్‌లతో పబ్బం గడుపుతూ పరిపాలనను గాలికి వదిలేశారన్నారు. విద్యా వ్యవస్థను భ్రష్టపట్టించారని, స్వయంగా ముఖ్యమంత్రే విద్యాశాఖను చూస్తున్నా ఎలాంటి మార్పు లేదని రామచందర్‌రావు విమర్శించారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తే రేవంత్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ డ్రామాలు ఆడుతున్నదన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేస్తోందంటూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనా అని రామచందర్‌రావు నిలదీశారు. ఎన్నికలు రాగానే హామీలిచ్చి రేవంత్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తున్నదన్నారు. ఉద్యోగుల సంఘం నేతలు మొన్ననే తనతో మాట్లాడారని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక రెండేళ్లుగా 60మందికిపైగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశార‌ని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, రిటర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *