- ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కుట్ర
- ఈనెల 12న ఆబూజ్ మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకం
- ఆదివాసులని అడవి నుంచి దూరం చేసేందుకే ఈ ఎన్‌కౌంటర్లు
- నిజాలు బయట పడతాయనే నిజనిర్ధారణ కమిటీని అడ్డుకుంటున్నారు
- మండిపడ్డ పౌర హక్కుల సంఘం జాతీయ నేత ప్రొఫెసర్ హరగోపాల్
- ఆదివాసీ ప్రజలకు పౌర సమాజం అండగా నిలవాలని పిలుపు
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17 : ప్రకృతిని దోపిడీ చేసి, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఆదివాస హక్కుల పోరాట సంఫీుభావ వేదిక నిర్వహించిన సమావేశంలో హరగోపాల్ పాల్గొని మాట్లాడుతూ.. ఈనెల 12న ఛత్తీస్‌గఢ్ ఆబూజ్ మడ్ లో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని ఆరోపించారు. ఆదివాసులని అడవి నుంచి దూరం చేసేందుకే ఈ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయన్నారు. ఆదివాసులకు భూమిపై హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్ గడ్ బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు.
కార్పొరేట్ శక్తుల అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకుందాని అన్నారు. ఆదివాసుల ఉద్యమానికి మావోయిస్టులు మద్దతు ఇస్తున్నారని, అందుకే వారిని ఏరి వేస్తున్నారని అన్నారు. 2026 మార్చ్ నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నే ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్‌కౌంటర్లు జరిగినప్పుడు వాస్తవాలను తెలుసుకొనేందుకు నిజనిర్ధారణ కమిటీ నాయకులు వెళ్తే అనుమతించడం లేదని అన్నారు. తాము వెళ్తే ఎన్కౌంటర్ లన్నీ బూటకమే అని తెలుతాయని, తమను అడ్డుకుంటున్నారన్నారు. ఆదివాసీ ప్రజలకు సంఫీుభావంగా పౌర సమాజం అండగా నిలవాలని హరగోపాల్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం నేతలు గడ్డం లక్ష్మణ్, నారాయణ, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.





