– నా ముఖం చూసి మాత్రమే వోటేయండి
-సెంటిమెంట్ మాటలతో మమత ప్రచారం
కోల్‌కతా, మార్చి 31: బీజేపీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బీజేపీని అనాగరిక పార్టీగా అభివర్ణించారు. దేశంలోని బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను టార్గెట్ చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులు, అవమానాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బాంకురాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగించారు. టీఎంసీ అభ్యర్థులు ఎవరనేది కాకుండా తన నాయకత్వాన్ని మాత్రమే చూడాలని ఈ సందర్భంగా వోటర్లను కోరారు. 294 నియోజకవర్గాల్లోనే తననే అభ్యర్థిగా చూడాలని విజ్ఞప్తి చేశారు. వోటర్ల జాబితాలో అవకతలను ప్రధానంగా ఆమె తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ ఒకేరోజు 30,000 అప్లికేషన్లు దాఖలైనట్టు పార్టీ నేత అభిషేక్ బెనర్జీ వద్ద సమాచారం ఉందని తెలిపారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు బిహార్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్టాల్ర నుంచి వోటర్లను బీజేపీ దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోందని ఆరోపించారు. బిహార్‌లో చేసినట్టుగానే రైల్వేలను ఉపయోగించుకుని బయట ప్రాంతాల నుంచి వోటర్లను రప్పించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది అని అన్నారు. భారత ఎన్నికల కమిషన్‌పై మమత తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ చెప్పినట్టు ఈసీఐ నడుచుకుంటోందని, బీజేపీ-ఈసీ కలిసి ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులను లాక్కుంటాయని ఆరోపించారు. వోటర్ల లిస్ట్‌లో కొందరిని టార్గెట్ చేసి తొలగించడం, మరికొందరిని జాబితాలో చేర్చడం జరుగుతోందన్నారు. తప్పుడు ఫారం-6 అప్లికేషన్లతో బీహార్ వోటర్ల జాబితాలో చేరేందుకు ప్రయత్నించిన పలువురు బీజేపీ కార్యకర్తలు పట్టుబడినట్టు చెప్పారు. ఇది కేవలం వోటర్ల హైజాకింగ్ కిందకే వస్తుందన్నారు. చట్టబద్ధత కలిగిన 60 లక్షల అప్లికేషన్లు ఇప్పటికే పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. బల్క్ ఎంట్రీలను మాత్రం ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నారన్నారు. ఇదెంతమాత్రం రొటీన్ పక్రియ కాదని, స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించడంపై జరుగుతున్న దాడి అని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్‌లో మాంసాహారంపై నిషేధం విధిస్తుందని, దొడ్డిదారిన ఎన్‌ఆర్‌సీ తీసుకొచ్చే యత్నం చేస్తుందని ఆరోపించారు. సాంస్కృతిక ఆంక్షలు, వివాదాస్పద విధానాలు అవలంబిస్తోదని మమత అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





