అంబేడ్కర్‌ను గౌరవించింది బీజేపీయే

– తగిన గుర్తింపు ఇవ్వని కాంగ్రెస్‌
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం భారత ప్రజలందరికీ సమానత్వం, న్యాయం, మౌలిక హక్కులు అందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దాదాపు 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగాన్ని అనేకసార్లు మార్చే ప్రయత్నం చేసిందని, ఎమర్జెన్సీ విధించి ప్రజల మౌలిక హక్కులను అణచివేసిందని విమర్శించారు. 1955లో నెహ్రూకి, తరువాత ఇందిరా గాంధీకి భారతరత్న ఇచ్చినా రాజ్యాంగ నిర్మాత, నిష్కళంక దేశభక్తుడు అంబేడ్కర్‌కు ఆ పురస్కారం ఇచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. మరణానంతరం అంబేద్కర్‌కు 1990లో బీజేపీ మద్దతుతో డాక్టర్‌ బీఆర్‌ భారతరత్న లభించిందని ఆయన గుర్తు చేశారు. అంబేద్కర్‌ స్మారకాలను ‘పంచతీర్థాలు’గా నిలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదని, మహూలో భారీ స్మారక నిర్మాణం, నాగ్‌పూర్‌లో వారి జీవితానికి సంబంధించిన క్షేత్ర అభివృద్ధి, ముంబైలో స్మారక ప్రాజెక్టు, లండన్‌లో అంబేద్కర్‌ చదువుకున్న ఇంటిని భారత ప్రభుత్వం కొనుగోలు చేసి మెరుగైన లైబ్రరీగా ఏర్పాటు చేశారని, ఇవన్నీ అంబేడ్కర్‌ పట్ల బీజేపీకి, ప్రధానికి ఎంత గౌరవం ఉన్నాయో చూపుతున్నాయని అన్నారు. అంబేడ్కర్‌ ఆలోచనలు దేశానికి శాశ్వత దిక్సూచి అంటూ వారి ఆలోచనలను అందరం ఆచరించాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడారని, అదే స్ఫూర్తితో బీజేపీ కూడా బలహీనవర్గాల కోసం నిరంతరం పోరాడుతుందని రామచందర్‌ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌ పేరిట ప్రజలను వంచించిందన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతోందనే బాధతో యువకుడు ఈశ్వర్‌ చారి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధాకరం అని, అతడి కుటుంబానికి సంతాపాన్ని, పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ గౌతం రావు, వేముల అశోక్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్‌, ఎస్సీ మోర్చా సీనియర్‌ నాయకుడు చింతా సాంబమూర్తి తదితర ప్రమఖులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *