పాలమూరు గడ్డ.. బీజేపీ అడ్డా

– మహబూబ్‌నగర్ సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: బీజేపీకి పాలమూరుతో అవినాభావ సంబంధం ఉందని, పాలమూరు గడ్డ బీజేపీ అడ్డా. కాషాయ జెండా… పాలమూరు అండ. అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డమీద పాలమూరులోని బీజేపీ అడ్డాకి వచ్చారన్నారు. కొన్నేళ్లుగా బీజేపీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేపట్టినా పాలమూరు నుండే ప్రారంభించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఉద్యమం అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో కృష్ణానది తీరం నుంచి కృష్ణమ్మ ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుండే తెలంగాణ పోరుయాత్రను ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను తెచ్చుకున్నామని, అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో నితిన్ నబిన్ పాలమూరు గడ్డమీద బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనానికి శంఖారావం పూరిస్తున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్ కార్యకర్తలు, ప్రజలు బీజేపీ¾ని ఆశీర్వదించాలని కోరుతున్నానన్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు బీజేపీ¾ గెలిచిందన్నారు. ఇంతకుముందు పాలమూరు, పక్కనున్న నారాయణపేట్‌లో, మక్తల్‌లో కూడా మున్సిపల్ చైర్మన్‌గా బీజేపీ గెలిచిందని, ఆమన్‌గల్‌లో కూడా స్వతంత్రంగా గెలిచిందని చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పాలమూరు టౌన్‌లో బీజేపీ జెండా ఎగురవేసిందని, ఇప్పటికే పాలమూరు నుంచి అనేకమంది యువత, మేధావులు, ప్రజలు పెద్దఎత్తున పార్టీలో చేరారని చెప్పారు. కార్యకర్తల కష్టార్జితంతో కాషాయ జెండా కింద ఇక్కడ మున్సిపాలిటీల్లో బీజేపీ గెలుస్తుందని తనకు పూర్తి విశ్వాసం ఉందని కిషన్‌రెడ్డి అన్నారు.

ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఇక్కడ మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగురవేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ యువతకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, రైతులకు, రైతు కూలీలకు, బీసీ వర్గాలకు ఇలా అన్ని వర్గాల ప్రజలకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. ఒక ఫ్రీ బస్ తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. గతంలో కేసీఆర్ ఇక్కడినుంచి ఎంపీగా గెలిచారు కానీ పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. రేవంత్ మాటలు కోటలు దాటతాయి.. కానీ పనులు పాలమూరు జిల్లాకు రావు అని ఎద్దేవా చేశారు. బీఆరఎస్ పార్టీ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడింది.. తాను ముఖ్యమంత్రి అయ్యాక అవినీతికి పాల్పడిన కేసీఆర్ ప్రభుత్వంలోని దోషులను చర్లపల్లి జైలుకు పంపిస్తానని రేవంత్ చెప్పి రెండేళ్లు దాటినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎందుకంటే కేసీఆర్ కు- రాహుల్ గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయాయన్నారు. పోన్ ట్యాపింగ్ కేసులో ఒక డీఎస్పీ స్థాయి పోలీసు అధికారిని సీఐగా డిమోషన్ చేశారు. ఇదొక్కటి మాత్రమే జరిగింది రేవంత్ ప్రభుత్వంలో అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అవినీతిరహిత పాలన రావాలంటే, నీతి నిజాయతీతో సమర్థ పాలన రావాలంటే నరేంద్ర మోదీ, నితిన్ నబిన్ నాయకత్వంలో బీజేపీ జెండా ఎగురాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ పాలమూరు నుంచి వెళ్తోంది.. రూ.50 వేల కోట్లు ఒక్క పాలమూరు జిల్లాలోనే రైల్వే ఎలివేటెడ్ కారిడార్ కోసం ఖర్చు పెడుతోందని వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *