ఆదివాసీ అభివృద్ధిపై శ్రద్ధ లేని బీజేపీ సర్కార్

-ఆదివాసీ హక్కుల పరిరక్షణలో విఫలం
– మంత్రి సీతక్క

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 18: ఆదివాసీ ప్రాంతాల సహజ వనరులపై బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ఆసక్తి ఆ ప్రాంతాల ప్రజల అభివృద్ధిపై కనిపించడం లేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆరోపించారు. దిిల్లీలోని ఇందిరా భవన్‌లో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు విక్రాంత్ భూరియా అధ్వర్యంలో బుధవారం ఏఐసీసీ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి సీతక్క ప్రసంగించారు. గ్రామ స్వయం పాలనకు కీలకమైన గ్రామ సభలను, పెసా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందన్నారు. గ్రామ సభల అనుమతి లేకుండా అనేక ప్రాజెక్టులను అమలు చేయడం ద్వారా ఆదివాసీల హక్కులను హరిస్తోందని ఆమె ఆరోపించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. భారత దేశ ఆత్మగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందని, అణగారినవర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో కాంగ్రెస్ ముందుంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఆదివాసీల హక్కులు, అభివృద్ధి, స్వాభిమానాన్ని కాపాడేందుకు ఆందోళనకు కాంగ్రెస్ సిద్దమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ గిరిజన సమాజాల అభివృద్ధి, హక్కుల పరిరక్షణ, స్వయం పాలన బలోపేతం వంటి అంశాలపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజనుల అస్థిత్వాన్ని కాపాడుతూ, వారి అభివృద్ది కోసం తీసుకున్న చర్యలను, ప్రవేశపెట్టిన చట్టాలను వివరించారు. ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులని, వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు దేశ సంపదలో అంతర్భాగమని పేర్కొన్నారు. అందుకే తొలి ప్రధాని నెహ్రూ హయాం నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఆదివాసీ గిరిజనుల అభివృద్ది కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు పాటుపడ్డాయని గుర్తు చేశారు. కానీ బీజేపీ పాలనలో అడవి బిడ్డల భూములు, అటవీ వనరులు, జీవనాధారాన్ని కోల్పోయే పరిస్థితులు రావడం అత్యంత ఆందోళనకరమని ఆమె అన్నారు. అభివృద్ధి అనేది ప్రజల సంక్షేమాన్ని కాపాడుతూ వారి గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉండాలని అన్నారు. కానీ ప్రస్తుతం మైనింగ్ కార్యకాలపాల కోసం అడవులను, పర్యవరణాన్ని ధంంసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాలను వనరుల నిల్వలుగా మాత్రమే చూస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో గిరిజనుల భూములను స్వాధీనం చేసుకోవడం, వారి అనుమతి లేకుండా ప్రాజెక్టులను అమలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అదేవిధంగా, గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి, వేష భాషలను, ప్రత్యేక గుర్తింపును దెబ్బతీసే విధంగా విధానాలు అమలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. గిరిజనులను ‘వనవాసులు’గా పేర్కొంటూ వారి అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆదివాసీలకు విద్య, వైద్య సదుపాయాలు పెంపొందించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని అన్నారు. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, సంక్షేమ పథకాల ద్వారా గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. గిరిజన ఆదివాసీ యువతను ఆర్థికంగా బలపరచడానికి స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు సరైన ధరలు కల్పించే విధానాలు అమలు చేయాలని కోరారు. గిరిజనుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ విధానాలు రూపొందించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తూ గిరిజనుల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని ఆదివాసీ గిరిజన సమస్యలు, అభివృద్ధి అవకాశాలపై చర్చించారు. ఆయా వర్గాల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యచరణను రూపొందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *