– అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం
– జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ మనదే విజయం
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 24: తెలంగాణలో బీజేపీ క్రమంగా ఎదుగుతోందని, ఒకప్పుడు గ్రామాల్లో ఒకటి రెండు వోట్లు వొచ్చిన చోట ఇప్పుడు వందల సంఖ్యలో వోట్లు వొస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని గుర్తించారని, గెలుపు చూస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో వొచ్చే అన్ని ఎన్నికలను గెలువడంతో పాటు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించబోతున్నామని భరోసా ఇచ్చారు. మోదీ పాలన, బిజెపి పనితీరు ఇందుకు నిదర్శనమని అన్నారు. రామచందర్ రావు అధ్యక్షతన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చారని కాంగ్రెస్, కేసీఆర్ తెచ్చారని బీఆర్‌ఎస్ చెబుతున్నాయని.. కానీ, పార్లమెంట్‌లో బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ వొచ్చిందని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో ఆత్మహత్యలకు కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. గత పదేళ్లుగా పాలకులు మాటలతో మభ్యపెట్టారని, కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క డిక్లరేషన్ కూడా అమలు కాలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాయని, గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయలేకపోతున్నాయని అన్నారు. అలాగే బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం విశ్వకర్మ పథకం తెచ్చిందని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇస్తుందని, జీ.ఓ. ఇస్తే తాము కూడా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. జీఎస్టీ వల్ల అన్ని వర్గాల ప్రజలకు లాభం చేకూరిందని, నిత్యావసరాలు తక్కువ ధరలకు దొరకడానికి మోదీయే కారణమని చెప్పారు. ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ వంటి కేంద్ర పథకాలు తెలంగాణలో ప్రజలకు చేరడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్లువొచ్చాయని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని లోటు చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తున్నదని విమర్శించారు. ఎరువుల కొరత రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా లోపమేనన్నారు. ఆఫీస్ బేరర్లు హైదరాబాద్‌ను వదిలి గ్రామాలకు వెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, కేంద్రం చేస్తున్న పనులను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలోని స్థానిక ఎన్నికలను ఆపొద్దని, వాటిలో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కిషన్ రెడ్డి నాయకత్వంలో వంద శాతం బీజేపీ గెలుస్తుందని తెలిపారు. రేవంత్ రెడ్డికి ఆట చేతగాక కిషన్ రెడ్డిపై మాట్లాడుతున్నారని విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





