న్యాయవాదులకు బీజేపీ చీఫ్ పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: న్యాయం కోసం ఎలా పనిచేస్తామో ప్రజల సేవలో కూడా అలాంటి అంకితభావంతో పనిచేయాలి అని న్యాయవాదులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను కూడా అడ్వకేట్ కమ్యూనిటీకి చెందినవాడినే అయినందున ఈ వేదికపై మాట్లాడే అవకాశం లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను మనం చూస్తున్నాం.. అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే చాలామంది భయపడుతున్నారు.. కొత్తకొత్త బూతులు నేర్చుకోవాల్సి వస్తోందని ప్రజలు చెప్తున్నారని తెలిపారు. అందువల్ల ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలి.. తెెెలంగాణలోని రాజకీయ సంస్కృతిని మనం మార్చాలి.. న్యాయవాదులు కదిలితే దేశమే కదులుతుంది అని రామచందర్‌రావు అన్నారు. మనం వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందినప్పటికీ కోర్టులో వాదనలు నడిపిన తర్వాత బయట మాత్రం కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. అరుణ్ జైట్లీ, కపిల్ సిబల్, అభిషేక్ మను సింఫ్వీు వంటి ప్రముఖ న్యాయవాదులు తమ పార్టీలు వేరైనా కోర్టుల్లో కలిసి పనిచేశారన్నారు. దేశవ్యాప్తంగా రాజ్యసభ, లోక్‌సభలలో సుమారు 250మంది న్యాయవాదులు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారంటూ యువ న్యాయవాదులు ఈ వృత్తిని సిన్సియర్‌గా తీసుకొని పనిచేయాలని రామచందర్‌రావు ఉద్బోధించారు.





