-స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు మనవే
-కార్యకర్తల సమ్మేళనంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
మెదక్, ప్రజాతంత్ర, జులై 18: ఈరోజు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ బలంగా విస్తరించిందని, ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణలో 40 లక్షల మంది సభ్యత్వం పొందగా ఉమ్మడి మెదక్ జిల్లాలోనే 8 లక్షల మంది సభ్యత్వం పొందారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. మెదక్‌లో కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా అభివృద్ధి వేగంగా జరుగుతోందని, మోదీ ప్రభుత్వం ఇప్పటివంకు తెలంగాణ అభివృద్ధి కోసం రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు కేటాయించిందని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు విప్పితే అబద్ధాలు, అభాండాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టే వారి ముందుకు వెళ్లడానికి ఆ పార్టీ నేతలకు మొహం చెల్లడం లేదన్నారు. మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందడం లేదని, రైతులు ఎంత అడిగినా పభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. మల్లన్నసాగర్ కోసం గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న భూములకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్లను నిర్మిస్తోందని, అలాగే కొత్త రహదారుల నిర్మాణానికి కూడా ముందుకొస్తోందని రామచందర్‌రావు చెప్పారు. బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి కాంగ్రెస్ నేతలకు ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బీసీ వర్గానికి చెందినవారిని ముఖ్యమంత్రిగా చేయాలని సూచించారు. బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసినది బీజేపీనే.. ఓబీసీలకు సంక్షేమ పథకాలను అందించేది కూడా బీజేపీనేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందున ఆ హామీని నెరవేర్చే బాధ్యత వారి మీదే ఉందన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బిజెపి మద్దతిచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే మద్దతిస్తామని చెప్పింది.. అయినా కేంద్రం అంగీకరించడం లేదని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది అని ఆయన విమర్శించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకుల సమన్వయంతో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు పూర్తి బాధ్యత స్వీకరిస్తున్నాని రామచందర్‌రావు చెప్పారు. కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లాలి. బీజేపీ సిద్ధాంతాలను, మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఆ తర్వాత ఇక్కడ మరింత పెద్ద సభను నిర్వపిద్దామని రామచందర్‌రావు అన్నారు.



