గ్రూప్‌-1పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

– ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు.
– అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ చేసిన పోరాట ఫలితమే ఈ తీర్పు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: జాబ్‌ క్యాలెండర్‌ దేవుడెరుగు.. ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఇది.. ఇప్పటికైనా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోవాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు ఒక ప్రకటనలో హితవు పలికారు. గ్రూప్‌-1 పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్‌ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. గ్రూప్‌-1 అభ్యర్థుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. పరీక్ష నిర్వహణలో గందరగోళం సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని తాము మొదటినుంచి చెబుతున్నామని గుర్తుచేశారు. మొండిపట్టుకు పోయి వేలాదిమంది అభ్యర్థుల జీవితాలతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చెలగాటమాడిరదని ఆయన దుయ్యబట్టారు. నోటిఫికేషన్‌ విడుదల నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం వరకు తప్పుడు విధానాలనే టీజీపీఎస్సీ అవలంబించిందని ఆరోపించారు. గ్రూప్‌-1 అభ్యర్థుల అభ్యర్థనలను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. పరీక్ష నిర్వహణలో గందరగోళం, మూల్యాంకనంలో అవకతవకలపై అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రులు జి.కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ కుమార్‌ సహా పార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యక్ష పోరాటం చేశారని రామచందర్‌ రావు గుర్తుచేశారు. బీజేపీ యువమోర్చా నిరంతర పోరాటాలు కొనసాగించిందన్నారు. ఒక పరీక్ష కేంద్రంలోని ఒకే గదిలో పరీక్ష రాసిన అభ్యర్థులు ఎక్కువమంది సెలక్ట్‌ కావడం, మూల్యాంకనం పూర్తిగా లోపభూయిష్టంగా నిర్వహించడంతో వేలాదిమంది గ్రూప్‌-1 అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు. ఏటా నిరుద్యోగులకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానన్న సీఎం రేవంత్‌ రెడ్డి కనీసం ఒక్క పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని నిరుద్యోగుల జీవితాలతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆడుకోవద్దని రామచందర్‌రావు హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *