– రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: ఎన్నికలు అంటే చాలా పార్టీలకు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఒక సాధనం మాత్రమే. కానీ బీజేపీకి ఎన్నికలతోపాటు దేశ గౌరవం కోసం, భారతదేశ స్వాతంత్య్రం కోసం, దేశ సంస్కృతి, ధర్మాన్ని కాపాడేందుకు పోరాడిన మహనీయులను గౌరవించే సంప్రదాయం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఇటీవలిల సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతిని రన్ ఫర్ యూనిటీ, మార్చ్ ఫర్ యూనిటీ వంటి కార్యక్రమాల ద్వారా ఘనంగా జరుపుకున్నాం. కొద్ది రోజుల క్రితం వందే మాతరం 150 సంవత్సరాల సందర్భంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈరోజు మరో ప్రత్యేక సందర్భం మహానాయకుడు భగవాన్ బిర్సా ముండా జయంతి. 1875లో నేటి రaార్ఖండ్ ప్రాంతంలో జన్మించిన బిర్సా ముండా 1875 నుండి 1900 వరకు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారు. కేవలం 25 ఏళ్ల వయసులో ఆయన జైలులో మరణించారు. ప్రతి భారతీయుడూ ఆయన జీవిత గాథ తెలుసుకోవాలి. ఆయన స్మారకార్థం భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జన జాతీయ గౌరవ దివస్‌గా ప్రకటించింది అని తెలిపారు. రాంజీ గోండ్, కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు వంటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధులందరూ అడవుల్లో నుంచే బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తమ వంతు కృషి చేశారన్నారు. మనం తరచుగా 1857 తిరుగుబాటును భారత తొలి స్వాతంత్య్ర సమరంగా గుర్తిస్తాం. కానీ ఆ తర్వాత కూడా ఎన్నో వర్గాలు, సమూహాలు తమ పోరాటాన్ని కొనసాగించాయన్నారు. అందులో గిరిజన సమాజాల పాత్ర అత్యంత కీలకమంటూ ముఖ్యంగా బిర్సా ముండా బ్రిటిషర్లతో పాటు మిషనరీల అన్యాయాలకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాడారని తెలిపారు. ఆయన భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఆశ, ప్రేరణ, ధైర్యాన్ని ఇచ్చారన్నారు. ఆయన 150వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ, భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా బీజేపీ ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థలో గిరిజన నాయకత్వాన్ని బలోపేతం చేసింది. ఈ ఏడాది గిరిజన సంక్షేమం కోసం రూ. 42 వేల కోట్లు కేటాయించడం మోదీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో గిరిజన సంక్షేమం ఎప్పుడూ ప్రాధాన్యం పొందలేదున్నారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎస్టీ కమిషన్ మొదటగా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలోనే ఏర్పడ్డాయని గుర్తు చేశారు. ఈ జన జాతీయ గౌరవ దివస్ సందర్భంగా తెలంగాణ ప్రజలందరినీ గిరిజన వీరులను స్మరించేందుకు, వేడుకల్లో పాల్గొనాలని కోరుతున్నాననన్నారు.





