బిల్లుల బకాయిలు.. పిల్లలకు పస్తులు

–  మధ్యాహ్న భోజనం పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బిల్లులు మూడు నెలలుగా చెల్లించకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి టి.హరీష్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. 20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గొడ్డుకారం, నీళ్ల సాంబారే భావి భారత పౌరులకు భోజనం అయిందన్నారు. మెనూ ప్రకారం పోషకాలతో కూడిన భోజనం అందించవలసి ఉన్నప్పటికీ ప్రభుత్వ అలసత్వం వల్ల ఎక్కడా అమలు కావడం లేదని, తనిఖీలు చేయవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుస్థితి ఉన్నప్పటికీ పట్టించుకోవడంలో  ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టలేని ముఖ్యమంత్రి విజన్‌-2047 గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూలు, స్కిల్‌ యూనివర్సిటీ అని మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. నీ నిర్లక్ష్యంతో ఒకవైపు గురుకులాల ఖ్యాతిని దిగజార్చావు.. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పోగొడుతున్నావు అని విమర్శించారు. విద్యాశాఖ నిర్వహించడానికి కాంగ్రెస్‌ పార్టీలో సమర్థవంతమైన మంత్రే లేడా అంటూ విద్యాశాఖ ఇంకెన్నాళ్లు మంత్రి లేని అనాధగా ఉండాలి అని ప్రశ్నించారు. దిల్లీి ట్రిప్పులు, రాజకీయాలు, కక్ష సాధింపు చర్యలు, పొలిటికల్‌ డైవర్షన్లు బందు పెట్టి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. విద్యాశాఖపై సమీక్ష చేయండి.. మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే విడుదల చేయండి అని సీఎం రేవంత్‌కు హరీష్‌రావు హితబోధ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *