తోటి మనుషుల పట్ల సమూహాల పట్ల మనము పెరిగిన సామాజిక నేపధ్య ప్రభావాలతో ముందే ఏర్పరుచుకున్న అభిప్రాయాలను జాతి, రంగు, ప్రాంతం పేర్లతో చూపించే పక్షపాత వైఖరుల గురించి జెన్నిఫర్ ఎల్. ఎబర్‌హార్డ్ అనే రచయిత ఒక పుస్తకం రాసారు. ఒక ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా తనకు ఎదురైన పరిస్థితులు, స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలు ‘BIASED’ UNCOVERING THE HIDDEN PREJUDICES THAT SHAPE OUR LIVES (మన జీవితాలను ప్రభావితం చేసే కనిపించని పక్షపాత ధోరణులను అన్వేషించడం) పుస్తకంగా రూపుదిద్దుకున్నాయి. పక్షపాతం (bias) కేవలం చెడ్డమనుషుల లక్షణం కాదని, మనందరిలోనూ తెలియకుండానే పక్షపాతధోరణి ఉంటుందని రచయిత మొదట్లోనే ముఖ్యమైన ఆలోచనను ప్రతిపాదిస్తుంది. చాలా సందర్భాలలో తెలియకుండానే మన ఆలోచనలను, తీర్పులను, ప్రవర్తనలను పక్షపాతం ప్రభావితం చేస్తుంది.
పక్షపాతాలు చరిత్ర, సంస్కృతి, సామాజిక వాతావరణం నుంచి ఉద్భవిస్తాయని ఇవి కేవలం వ్యక్తిగత అభిప్రాయాలకే పరిమితం కాకుండా, పోలీసువ్యవస్థ, న్యాయవ్యవస్థ, విద్యావ్యవస్థ, పనిస్థలాలు, రోజువారీ వ్యక్తిగత సంబంధాలు వంటి అన్నిరంగాలలోనూ ఈ ధోరణులు కనిపిస్తాయి. ఉదాహరణకు, ఒకవ్యక్తి రంగు, జాతి లేదా సామాజిక నేపథ్యం ఆధారంగా మనం తక్షణ నిర్ణయాలు తీసుకోవడం లేదా వేరుగా ప్రవర్తించడం చాలా సులభంగా జరుగుతుంది. అమెరికాలో వీధులలో ఆఫ్రికన్ అమెరికన్లు కనిపిస్తే నేరాలు చేసే వ్యక్తులుగాను, తెల్లవాళ్ళు కానివారు కనిపిస్తే మరోరకంగాను, ఆసియా దేశస్తుల పట్ల నిశ్చిత అభిప్రాయాలతో పక్షపాత ధోరణులు ఎలా పనిచేస్తాయో ఉదాహరణాలతో సహా శాస్త్రీయంగా చర్చ చేస్తుంది.
ఎబర్‌హార్డ్ వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకుంది. ఒక ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా తనకు ఎదురైన పరిస్థితులు, అలాగే ఒక శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలు ఈ పుస్తకానికి పునాది అయ్యాయి. ఆమె జీవనానుభవాలు, శాస్త్రీయ అధ్యయనాలు కలిపి ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి మనలో పక్షపాతం సహజంగా ఉన్నా, దానిని గుర్తించి అర్థం చేసుకోవడం ద్వారా నియంత్రించుకోవచ్చునని, పక్షపాతధోరణి ఇతరులను ఎలా గాయపరుస్తుందో తెలుసుకుని సరిచేసుకుంటే, సమానత్వం, న్యాయం కలిగిన వ్యవస్థలను సృష్టించగలం అని చెప్తుంది.
ఈ పుస్తకం మనకు ఒక హెచ్చరిక, అవగాహన. మనల్నిమనం పరిశీలించుకోవడానికి, సమాజంలోని లోతైన పక్షపాతాలను అర్థం చేసుకోవడానికి, ఎదుర్కోవడానికి ఈ పుస్తకం దిక్సూచిగా పనిచేస్తుంది. అమెరికా అనుభవాలు ఆధారంగా రాసినా, భారతదేశానికి కూడా ఈ పుస్తకంలోని విషయాలను అన్వయించుకోవచ్చు. మన సమాజంలో మతం, కులం, ప్రాంతం, భౌగోళిక విభజనలు ఆధారంగా రోజురోజుకు పక్షపాత ధోరణి పెరుగుతోంది. మన ఇళ్లలో, వీధుల్లో, పాఠశాలల్లో, పనిస్థలాల్లో స్పష్టంగా ఈ ధోరణులు కనిపిస్తున్నాయి. అద్దె ఇళ్ళు, విద్యాలయాలు, వీధులలో వేషభాషలపై, కులం మతం అంటూ ఈ పక్షపాత ధోరణి కనిపిస్తూనే ఉంది. మనకు తెలియకుండానే ఇతర కులాలు, మతాలు, పేదలు, మహిళలు- వారు తినే తిండి కట్టే బట్టపట్ల మనకు తెలియకుండానే పక్షపాతంతో కూడిన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ఉంటాము.
ఈ పుస్తక రచయిత చెప్పిన విషయాలలో ముఖ్య అంశం మనలో కొందరం పక్షపాతానికి అతీతమని అభ్యుదయ భావాలు కలిగి ఉన్నామని మనము పక్షపాత స్వభావం కలిగి ఉండమని అనుకుంటాము కానీ ఎప్పుడో ఒకసారి తెలియకుండానే అవి బయట పడతాయని చెప్పిన ఈ పుస్తకం మనకుమనం పరీక్షించుకునే మంచి అవకాశం ఇస్తుంది. రచయిత చెబుతున్నట్లు, పక్షపాతం సహజమైనదే అయినప్పటికీ, అది శాశ్వతం కాదు. దాన్ని గుర్తించి, అర్థం చేసుకుని, నియంత్రించడం సాధ్యం. ఇది భారతదేశం లాంటి భిన్నసంస్కృతుల సమాజంలో మరింత అవసరం. ‘BIASED’ పుస్తకం కేవలం అధ్యయనం కాదు, మనలో ఆలోచన కలిగించే అద్దం. పక్షపాతం- జీవితాల్లో ఎలా పనిచేస్తుందో చూపించడంతో పాటు, దానిని తగ్గించి సమానత్వం మరియు న్యాయం కలిగిన సమాజం నిర్మించడానికి పిలుపునిస్తుంది. మంచి పరిశోధనతో కూడిన పుస్తకాన్ని అందించినందుకు ప్రచురణకర్తలకు ధన్యవాదాలు.
-ఆర్. వెంకట రెడ్డి





