భూదాన్ భూముల విలువ‌ రూ.500 కోట్లు

– ఆంధ్రా లాబీయింగ్ పని చేసిందా?
– బాధితులందరికి న్యాయం జరిగేనా??

ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 10 : ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల్లో 600 నివాసాల కూల్చివేతలపై రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. జిల్లా కలెక్టరేట్ కూత వేటు దూరంలో వెలుగుమట్లలో భూదాన్ ట్రస్టు బోర్డుకు సంబంధించి సర్వే నంబర్లు 147, 148, 149లో 62.7 ఎకరాల భూమి ఉంది. ఒకప్పుడు రాళ్లు రప్పలు, గుట్టలుగా ఉన్న ఈ పరిసర ప్రాంతాలన్ని ఇప్పుడు మినీ నగరంగా మారాయి. కలెక్టరేట్ తో  పాటు ఖరీదైన  భవనాలు, వ్యాపార సముదాయాలు నిర్మాణం కావడంతో సమీప భూముల విలువలు అమాంతం పెరిగాయి. హిల్స్ ప్రాంతంగా ఉండంతో అక్కడ ఉండడానికి బడా బాబులు  ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేగాక  కలెక్టరేట్ రాకతో  ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగాయి. తాము కాపాడిన 31 ఎకరాల భూమి ప్రభుత్వ మార్కేట్ విలువ రూ.250 కోట్లు ఉంటుందని సాక్షాతూ జిల్లా కలెక్టరే ప్రకటించారు. ప్రయివేట్ వ్యక్తుల చేతిలో మరో 31 ఎకరాలు ఉంది.  మొత్తం భూమి విలువ రూ.500 కోట్ల వరకు ఉంటుందని ప్రాథ‌మిక అంచనా. ఈ భూముల సమీపం నుంచే నాగ్ పూర్  అమరావతి గ్రీన్ ఫీల్డ్  హైవే నిర్మాణం జరుగుతుండటంతో ఈ భూమికి మరింత డిమాండ్ పెరిగింది. ఈ నేపధ్యంలో గత 12 ఏళ్ల  నుంచి వినోభా కాలనీగా అత్యంత నిరుపేదల నివసం ఉంటున్న వారిని కోర్టు తీర్పు, భూదాన్ ట్రస్ట్ ఆదేశంతో ఖాళీ చేయించారు. అయితే ఈ భూమి సమీపంలో బడా బాబుల భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లు, పట్టా భూములు ఉండటం వల్లనే ఖాళీ చేయించారనే ఆరోపణలు వెలువెత్తు తున్నాయి. ఒక పక్క పేదలు తలదాచుకునేందుకు నివాస స్థలాలను ఏర్పాటు చేసుకుంటే మరో పక్క అక్రమార్కులు మట్టి అమ్మకాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు భూధా న్ భూమిగా చెప్పబడుతున్న దానిలో దాదాపు 100 అడుగుల మేర గుట్టను తవ్వి మట్టిని తరలించారు మట్టిని తరలిస్తున్న సమయంలో ఏ అధికారి కూడా కన్నెత్తి చూడలేదు మట్టి తరలింపు పై ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. పేదలు కష్టపడి గూడు నిర్మించుకుంటే ఆక్రమణల  పేరుతో బయటకు నెట్టారు కానీ అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే, జిల్లా యంత్రాంగం ఇప్పుడు ఇళ్ళను కూల్చివేసిన స్థలం 31 ఎకరాల్ల పరిధిలోనే నని  మిగిలిన 31 ఎకరాలు ఏమయ్యాయని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కనీసం అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. ఎందుకు ఆ వైపు చూడటం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అసలు ఇద్దరు భూస్వా ములు పేదలకు దానం చేయమని భూదాన్ బోర్డు కు భూమి ఇచ్చారు. దాదాపు 70 ఏళ్ల నుంచి భూమి పంచకుండా నేడు వందల మంది పేదలు  రూపాయి రూపాయి పోగేసి లక్షల రూపాయలతో పక్కా ఇల్లులు నిర్మించుకొని నివాసం ఉంటుంటే వారు ఆక్రమణదారులని భారీగా  పోలీసులను మోహరించి కట్టుబట్టలతో ఇళ్ళు నేలమట్టం చేయడంపై ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో బద్నామ్ అయ్యారు. ఇక్కడ ఖాళీ చేయించి మరోచోట ఇస్తామని చెప్పడం మరింత విడ్డురంగా ఉందంటున్నారు. సుమారు 62 ఎకరాల్లో కేవలం 31 ఎకరాల గురించి అధికారులు లెక్కలు చెబుతున్నారు. అందులో 10 ఎకరాలు ప్రభుత్వ విద్యా సంస్థలకు అందజేశామన్నారు. ఈ 10 ఎకరాల  భూమి గతంలో జర్నలిస్టులకు ఇస్తున్నట్లు జారీ చేయగా వివిధ కారణాలతో ఆ అంశం తెరమరుగైంది . అందులో నుంచి 5 ఎకరాలు ప్రభుత్వ విద్యా సంస్థలకు కేటయించారు. మరో 3 ఎకరాల్లో ఇళ్ళు నిర్మించడంతో నేడు కూల్చారు.18 ఎకరాలు మిగిలింది. ఇప్పటికే 31 ఎకరాలు కబ్జా చేసిన ఓ మంత్రి సన్నిహితులపైనే ప్రతి ఒక్కరు ఆరోపిస్తున్నారు. నాకు తెలియదని రెవెన్యూ మంత్రి అంటుండగా, నాకు సoబందం లేదని మరో మంత్రి అంటున్నారు. ఖమ్మం తో పాటు ఇతర జిల్లాల పోలీసు బలగాలు, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, భారీ సంఖ్యలో ఇళ్ళు కూల్చే యంత్రాలు  ఏర్పాటు చేయడం అంటే మాములు విషయం కాదు. కూల్చి వేతల వెనుక ”షాడో” పై రకరకాల చర్చ నడుస్తోంది. భూదాన్ భూముల విలువ సుమారు రూ.500 కోట్ల వరకు  ఉంటుంది. ఎవరి వాటా.. ఎంత.. ? అనేది లెక్కలు వేస్తున్నారు బాధితులు. రూ .కోట్లు రాకపోతే ఎవరు ఇంత రిస్క్ తీసుకుంటారని స్థానికంగా  బలమైన చర్చ నడుస్తోంది. ఆంధ్రా నుంచి బలమైన  లాబీయింగ్ తో  ప్రభుత్వ పెద్దల సహకారంతో కొద్ది గంటల్లోనే ఇళ్లు నేలమట్టం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 600 నివాసాలు ఉండగా వారి ఆధార్ ఇతర వివరాల ఆధారంగా అర్హులకు అందజేస్తామని అధికారులు చేబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా తో పాటు సమీప జిల్లాల వారు పదేళ్ల కిందట ఇక్కడకు వలస వచ్చి ఇళ్ళు వేసుకున్నారు. మరికొందరు కొనుగోలు చేశారు. బాధితులందరికి న్యాయం జరిగే పరిస్థితి కనబడటం లేదు. మరో వైపు 15 రోజుల నుంచి ఖమ్మం అంబేడ్కర్ భవనం, టీటీడీసీ భవనంలో బాధితులు ఇంటి సామాన్లతో సహా ఆశ్రయం పొందుతున్నారు. కనీస నివాస సౌకర్యాలు లేకపోయిన వారు ఇక్కడ ఉంటున్నారు. ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి లో భోజనాలు పెట్టలేదు. బీజేపీ, బి.ఆర్.ఎస్. చెరొక పుట భోజనాలు అందించాయి. ఈ నెల 15 లోపు అర్హులకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బహిరంగ ప్రకటన చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పరిధిలో ఇళ్ల కూల్చివేత జరగడంతో ఆయన సీఎం ను కలిసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *