పెద్దల కోసం పేదలు బ‌లి!

– రూ.500 కోట్ల భూదాన్ భూములు
– అస‌లు భూదాన్ భూములు 62ఎక‌రాలు
–  కానీ 31 ఎక‌రాలు మాత్ర‌మే ప్ర‌స్తావించ‌డం విశేషం
– మిగిలిన 31 ఎక‌రాలు ఓ మంత్రి బంధువుల క‌బ్జాలో..
– పుష్క‌ర‌కాలంగా అధికార్ల నిర్ల‌క్ష్యం
– తుమ్మ‌ల‌-పొంగులేటి మధ్య కూల్చివేతల చిచ్చు
– ఖమ్మంలో రోజుకొక ఉత్కంఠ

ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : భూదాన్  భూముల చుట్టూ ఖమ్మం రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏపీ-తెలంగాణ సరిహద్దు ఉండడంతో బడా బాబుల కళ్ళు ఈ భూములపై పడ్డాయి. ఖమ్మం సమీకృత కలెక్టరేట్ పక్కనే ఉండడం, అంతర్ రాష్ట్రాలు, జాతీయ రహదారులకు అనుకోని ఉండడంతో ఇక్కడి  భూమికి రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఆ భూముల విలువ రూ.500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పటిష్టమైన భవనాలను బుల్డోజర్లతో పునాదులతో సహా కూలగొడుతుంటే బాధితుల ఆర్తనాదాలతో అక్కడ పరిస్థితి హృదయ విదారకమైంది. పదేళ్లుగా శాశ్వత నివాసాలు ఏర్పరచుకొని భూదాన్  భూముల్లో ఉన్న వారిని అకస్మాత్తుగా ఖాళీ చేయిస్తున్న వైనాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటున్నా కమ్యూనిస్టు, బిఆర్ఎస్, బీజేపీ సహా ఇతర ప్రజా సంఘాలు తప్పుబడుతున్నాయి.పేదలకు భూమి పంచాలని నాటి భూస్వాములు ఇస్తే దాదాపు 70 ఏళ్ల నుంచి భూమి పంచకుండా నేడు వందలమంది పేదలు  రూపాయి రూపాయి పోగేసి లక్షల రూపాయలతో పక్కా ఇల్లులు నిర్మించుకొని నివాసం ఉంటుంటే వారు ఆక్రమణదారులని భారీగా  పోలీసులను మోహరించి కట్టుబట్టలతో త‌రిమి ఇళ్ళు నేలమట్టం చేయడం సమర్ధనీయమా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇక్కడ ఖాళీ చేయించి మరోచోట ఇస్తామని చెప్పడం మరింత విడ్డురంగా ఉందంటున్నారు. భూదాన్  భూములు మొత్తం 62 ఎకరాలకు కాగా 31 ఎకరాలను మాత్రమే జిల్లా యంత్రాంగం ప్రస్తావిస్తూ రూ.250 కోట్ల విలువ భూమి కాపాడామని జబ్బలు చరుచుకుంటున్నారు. మరో 31 ఎకరాలు బడా బాబుల కబ్జాలో ఉందనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. మొత్తంగా అక్కడ భూమి విలువ రూ.500 కోట్ల అన్నమాట. ఇలా ఉండగా భూదాన్ భూములు ఆక్రమణలను దగ్గరుండి మూడు రోజులుగా పర్యవేక్షిస్తున్న ఖమ్మం ఆర్డీవో నరసింహారావు ఆకస్మిక బదిలీ తీవ్ర చర్చనీయాంశమవుతుంది.

భూదాన్ భూముల చరిత్ర ఇది

ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని 147, 148, 149, 160 సర్వే నెంబర్లలో 62.7 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఈ భూమిని 1953 లో కలవల రాజా రామారావు, రాయల కోటేశ్వరరావు అనే భూస్వాములు అచార్య వినోబా భావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమంలో భాగంగా వారు ఆ భూమిని బోర్డుకు దానం చేశారు. అప్పట్లోనే ఈ భూములను భూదాన్ యజ్ఞ బోర్డు పేరిట ముంతఖబ్లలో నమోదు చేశారు. దశాబ్దాల క్రితం దానం చేసిన ఈ భూమి ఖమ్మం వైరా జాతీయ రహదారిపై ప్రదానరోడ్డుపై ఉండటం ఈ భూమిని అనుకొని ప్రయివేట్ వ్యక్తుల పట్టా భూములు ఉండటంతో కొంత మంది రియలర్టర్లు ఈ భూమి మీద కన్ను వేసి తప్పుడు పత్రాలు సృష్టించి ఈ భూములు మావి అని వాదించడం ప్రారంభించారు. దీనికి తోడు యుసిసిఆర్ఐఎంఎల్ పార్టీకి సంబంధించిన గ్రామీణ పేదల సంఘం (ఒపిడిఆర్) ఆధ్వర్యంలో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహ‌బూబాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 300మంది పేదలు ఇక్కడ 2013లో గుడిసెలు వేసుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇదేమని అడిగితే భూదాన్ ట్రస్ట్ బోర్డు పేదలకు ఇళ్ళ పట్టాలను ఇచ్చిందని పట్టా కాగితాలను చూపిస్తూ వచ్చారు. ఇదే అదనుగా కొంతమంది మధ్య‌ దళారులు నిరుపేదలకు ఇళ్ళ స్థలం ఆశ చూపించి రూ.1లక్ష నుంచి రూ.5ల క్షల వరకు వంద గజాల చొప్పున విక్రయించి ఆయా స్థలంలో గుడిసె, రేకుల షెడ్డును వేసుకోవడానికి అనుమతి ఇచ్చి ఇతరులకు అమ్మడం మొదలు పెట్టారు. 2014 నుంచి ఎంతో మంది పేదలు భూములు కొన్నారు. దాదాపు 600లకు పైగా గృహాలు వెలిశాయి. వీరిలో కొంత మంది పక్కా ఇళ్ల‌ను నిర్మించుకున్నారు. 2014లో అప్పటి భూదాన్ బోర్డు తమకు 100 గజాల చొప్పున ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చిందని, అందుకే తాము ఇక్కడ గుడిసెలు వేసుకున్నామని నిరుపేదలు చెబుతూ వచ్చారు. ప్రభుత్వం మాత్రం భూదాన్ భూములను విక్రయించడం లేదా ఆక్రమించడం చట్టవిరుద్ధమంటోంది. 2023 జూలై 24న వందలాది మంది వెలుగుమట్ల భూముల్లో రాత్రికి రాత్రే షెడ్లు, గుడిసెలు నిర్మించారు. వీటిని తొలగించడానికి రెవెన్యూ అధికారులు, పోలీసులు భారీగా తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ చేయగా, ఆందోళనకారులు కర్రలతో ప్రతిఘటించారు. తర్వాత 2024 ఆగస్టు 27న కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్ అసిసోయేషన్ నాయకులకు సంబంధించిన ప్రయివేట్ వ్యక్తులు పోలీసులతో కలిసి వచ్చి అక్కడి షెడ్లను తొలగించే ప్రయత్నం చేయగా పెద్ద ఎత్తున ఘ‌ర్ష‌ణ‌లు చోటుచే సుకున్నాయి. పేదలు ఎదురుతిరగడంతో వెనక్కి వెళ్లిపోయారు. అయితే భూదాన్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని గమనించిన ఖమ్మం అర్బన్ తహసిల్దార్ 2019 లోనే ఆక్రమణలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఖమ్మం అర్బన్ తహసిల్దార్ జారీ చేసిన నోటీసులపై కొంతమంది పేదలు హైకోర్టులో చాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు భూదాన్ భూముల అంశంలో న్యాయ‌ప‌రిధి సరిపోదని తెలుపుతూ తహసిల్దార్ ఆర్డర్ పై స్టే ఇస్తూ పిటిషన్ దారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా భూదాన్ భూమి స్వభా వాన్ని మార్చడానికి వీలు లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కొర్ల పాటీ పరమేశ్వరి మరో 9 మంది పిటిషన్ దారులు కలిసి 2023 లో భూదాన్ భూములలో నిర్మించిన నిర్మాణాలను తొలగించ కుండా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ కోర్టుకు సమర్పించిన పట్టా వివరాలు సరిగ్గా లేవని, భూదాన్ భూములలో పేదలు ఇండ్లు నిర్మించుకున్నట్లు దర ఖాస్తు సమర్పించారని, పిటిషన్ దారులకు సంబంధించిన నిర్మా ణాలను మాత్రం తొలగించవద్దని, మిగిలి ఉన్న భూమిలో ఎటువంటి కొత్త నిర్మాణాలు చేపట్టవద్దని స్టేటస్ కో జారీ చేసింది. అయితే ఈ భూమి వివాదంపై తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు నవోదయ కాలనీ లోని పేద ప్రజలకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. అందులో భాగంగానే ఈ ఏడాది జనవరి 17న హైకోర్టును ఆశ్రయించిన పేదలకు తమ బోర్డు ఎటువంటి భూమిని కేటాయించలేదని 5 ఎకరాలు కేజీబీవీ పాఠశాలకు, 5 ఎకరాలు మోడల్ స్కూల్ కోసం మాత్రమే తాము భూమిని కేటాయించామని భూదాన్ ట్రస్ట్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో భూదాన్ భూములలో నివసిస్తున్న 308 ఆక్రమ ణదారులకు వెంటనే ఖాళీ చేయాలని గత నెల 17న తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు నోటీసులు జారీ చేసింది . అయితే కొంతమంది ఆక్రమణదారులు 2014 లో తమకు అలాట్మెంట్ వచ్చినట్లు పట్టా కాగితాలు చూపిస్తున్నా అవి ఏమి భూదాన్ బోర్డు ట్రస్ట్ రికార్డులో మాత్రం అలాట్మెంట్ చేసినట్లు లేదు. దీంతో తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు మాత్రం సర్వే నెంబర్ 147, 148, 149 లో ని భూము లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు లేఖ రాసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు 2023లో రిట్ పిటి షన్ దాఖలు చేసిన ఆవుల శిరీష తోపాటు మరో 9 మందికి సంబంధిం చిన నిర్మాణాలు మినహాయించి మిగిలిన భూమిని ప్రభుత్వ ఆధీనం లోకి తీసుకోవాలని భూదాన్ ట్రస్ట్ బోర్డు కలెక్టర్ ను కోరింది. భూదాన్‌ భూముల విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్లనే పుష్కర  కాలంగా వివాదం కొనసాగుతూ వచ్చింది. ఈ  భూముల అమ్మ కాలు, కొనుగోళ్ళు జరగకూడాదు. మరి జరుగుతున్నపుడు, ప్రజల ఇళ్లు నిర్మించుకున్నప్పుడు, విద్యుత్ సౌకర్యం, ఓట్ల నమోదు, ఇంటి ట్యాక్స్ వంటి అంశాలలో  అధికారులు ఏం చేశారనే ప్రశ్న తలెత్తుంది . అనాడే స్పందించి అడ్డుకుంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది  కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న‌ది.

మంత్రుల మధ్య కూల్చివేతల చిచ్చు

మంగళవారం రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లో తన శాఖ ప్రెస్ మీట్ నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఖమ్మంలో భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ లో అక్కడి మీడియా ప్రతినిధులు అడగడంతో మంత్రి వెంటనే ఖమ్మం కలెక్టర్ కు ఫోన్ చేసి రెవెన్యూ శాఖ మంత్రికి తెలియకుండా తన జిల్లాలో భూదాన్ భూముల్లో పేదల ఇళ్ళు కూల్చడం సరికాదని, ఇదేం పద్ధతి అని సీరియస్ అయ్యారు. కూల్చివేతల అంశం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నియోజకవర్గం అయిన ఖమ్మంలో జరిగింది. దీంతో మంత్రుల ఇద్దరి మధ్య మరింత గ్యాప్ ఏర్పడింది. తనకు సంబంధం లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. మంత్రి తుమ్మలకు సంబంధం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. మంత్రి పొంగులేటిని కాదని కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చింది ఎవరనే  చర్చ నడుస్తోంది. బడా బాబులు ఓ మంత్రికి సన్నిహితులు(బావ, బామ్మర్ది) అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. వందల సంఖ్యలో పోలీసులు, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు ఇతర సిబ్బంది భారీగా కూల్చివేతలు నిర్వహించడం మాములు విషయం కాదనే వాదన వినిపిస్తుంది. పక్కాగా మంత్రాంగం నడిచిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే భూదాన్ భూములు ఆక్రమణలను దగ్గరుండి  మూడు రోజులుగా పర్యవేక్షిస్తున్న ఖమ్మం ఆర్.డి.ఓ. నరసింహారావు(రెవెన్యూ ) ఆకస్మిక బదిలీ జరిగిందంటున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *