– భూదాన్ భూదందాపై రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూములకు సంబంధించిన లావాదేవీలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందో లేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని భావిస్తే చేసే ఉద్దేశం లేదంటే అదే విషయాన్ని కోర్టుకు చెప్పాలంటూ తేల్చి చెప్పింది. నాగారంలోని సర్వే నెం 194, 195లో తండ్రి ద్వారా సంక్రమించిన 10.17 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల పేరుతో అధికారులు మార్చేశారంటూ అదే గ్రామానికి చెందిన వి.రాములు హైకోర్టును ఆశ్రయించారు. అధికారులకు వినతిపత్రాలను అందజేసినప్పటికీ చర్యలు లేవన్నారు. ఈ వ్యాజ్యాన్ని విచారణ జరిపిన జస్టిస్ కె.లక్ష్మణ్.. విచారణ కమిషన్ ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేట్ వ్యక్తులైన అబ్దుల్ జావీద్, అర్షియా సుల్తానాల సాయంతో అధికారులు పిటిషనర్ భూములను థర్డ్ పార్టీలకు కేటాయించారని పిటిషనర్ తరపు న్యాయవాది విజయలక్ష్మి వాదించారు. ఆ తర్వాత మధ్యవర్తుల అండతో సబ్ డివిజన్లను కేటాయించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు విక్రయించారని చెప్పారు. ఈ భూబాగోతానికి సహకరించిన అధికారులు, ప్రైవేట్ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గత నెల 28న రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేసినప్పటికీ చర్యలు లేవన్నారు. వాదనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పైవిధంగా ఆదేశాలు జారీ చేసి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.



