మార్చి నాటికి భూభార‌తి కొత్త పోర్ట‌ల్‌

– ఒకే గొడుగు కింద‌కు రెవెన్యూ, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్‌
– వారం రోజుల్లో మ‌రో మూడువేల మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లు
– రెవెన్యూ, హౌసింగ్ శాఖ‌ల మంత్రి పొంగులేటి

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6ః రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్‌, స‌ర్వే- ల్యాండ్ రికార్డ్స్ విభాగాల‌ను భూభారతి పోర్ట‌ల్‌లో ఒకే గొడుగు కింద‌కు తీసుకొస్తున్నామ‌ని, ఈ పోర్ట‌ల్‌ను మార్చి నాటికి పూర్తిస్ధాయిలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార, పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు, పార‌ద‌ర్శ‌కంగా ఉండేలా ఈ పోర్ట‌ల్‌ను రూపొందించామ‌ని వెల్ల‌డించారు. వ్య‌వ‌సాయ‌, వ్య‌వ‌సాయేత‌ర భూములు, దేవాదాయ‌, అట‌వీ, వ‌క్ప్ భూములు త‌దిత‌ర అన్ని వివ‌రాలు క‌నిపించేలా పోర్ట‌ల్‌లో పొందుప‌రిచామ‌ని తెలిపారు. నాంప‌ల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ స‌ర్వీసెస్ అసోసియేష‌న్ (ట్రెస్సా) 2026 డైరీని ఆయ‌న మంగ‌ళ‌వారం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గ‌త ప్ర‌భుత్వ ప‌దేళ్ల పాల‌న‌లో రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌లో ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంద‌నే న‌మ్మ‌కంతో తెలంగాణ ప్ర‌జానీకం ఇందిర‌మ్మ ప్ర‌భుత్వాన్ని తెచ్చుకున్నారు.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో వారి న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా ప‌దేళ్ల కాలంలో భ్ర‌ష్టుప‌ట్టిన రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌ను ఒక్కో మెట్టు పేర్చుకుంటూ గ్రామస్ధాయి వ‌ర‌కు బ‌లోపేతం చేశామ‌ని. ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చామ‌ని చెప్పారు. అయితే ఇవి స‌రిపోవ‌ని, చేయాల్సింది ఇంకా ఎంతో ఉంద‌ని అన్నారు.

రాష్ట్రంలో ద‌శాబ్దాలుగా సాగుతున్న భూవివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కనుగుణంగా గ‌త‌ రెండేళ్ల‌లో ఎన్నో విప్ల‌వాత్మ‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని తెలిపారు. భూభార‌తి పోర్ట‌ల్ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. రాష్ట్ర రైతుల భూముల‌కు సంబంధించి గుండెకాయలాంటి స‌ర్వే విభాగాన్ని పటిష్టప‌రుస్తున్నామ‌ని ఇందులో భాగంగా ఇప్ప‌టికే 3,500 మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను నియామ‌కం పూర్తి చేశామ‌ని, వారం రోజుల్లో మ‌రో మూడువేల‌ మందిని తీసుకోబోతున్నామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌లను త‌మ ప్ర‌భుత్వం అర్ధం చేసుకుంద‌ని, ఆర్ధిక ఇబ్బందుల వ‌ల్లే కొంత ఆల‌స్యం జ‌రుగుతున్న‌ద‌ని, ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు అందాల్సిన అన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో ట్రెస్సా అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వంగా ర‌వీంద‌ర్ రెడ్డి, గౌత‌మ్ కుమార్‌, కోశాధికారి ర‌మ‌ణారెడ్డి, క‌ల్చ‌ర‌ల్ డైరెక్ట‌ర్ ఏనుగు న‌ర్సింహారెడ్డి, టిఎన్‌జీవో అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఏలూరి శ్రీ‌నివాస్‌, జ‌గ‌దీష్, ఆర్డీవో ఉపేంద‌ర్ రెడ్డి జీహెచ్ఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్ చంద్ర‌క‌ళ త‌దిత‌రులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *