కొత్త దిక్సూచి ‘భూ భారతి’

– చరిత్రాత్మక చట్టానికి నేటిìతో ఏడాది పూర్తి
– 5.20 కోట్లమందికిపైగా పోర్టల్ సందర్శన
– 70 లక్షలమంది లాగిన్ అయ్యారు
– 3.80 లక్షల మందికి పాస్‌బుక్‌లు జారీ                                                                                            – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పునర్నిర్మిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూహక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతి రహిత సేవలు సామాన్యుడికి సులభంగా అందేలా గత ఏడాది తీసుకొచ్చిన భూభారతి చట్టం రాష్ట్ర చరిత్రలో కీలక సంస్కరణగా నిలుస్తుందన్నారు. ఈనెల 14తో భూభారతి అమలులోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తన కార్యాలయంలో అధికారులతో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఒక చట్టానికి ఏడాది పూర్తయిన సందర్భం మాత్రమే కాదని, రాష్ట్రంలో భూ హక్కుల రక్షణకు కొత్త శకానికి నాందిపలికిన రోజు అని వ్యాఖ్యానించారు. ‘భూ భారతి’కి ముందు, ఆ తర్వాత ఉన్న పరిస్ధితులపై చర్చించారు. ఈ చట్టం తీసుకొచ్చే నాటికి ధరణి పోర్టల్ వల్ల ప్రజానీకం ఎదుర్కొన్న పరిస్ధితులను మంత్రి గుర్తు చేశారు. నాటి పరిస్ధితిని పూర్తిగా మార్చాలన్న సంకల్పంతో పారదర్శకత, బాధ్యతాయుత, వేగం అనే మూడు ప్రధాన సూత్రాలతో రెవెన్యూ వ్యవస్ధను ప్రజలకు చేరువ చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే చరిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, ఈ చట్టం రాష్ట్రంలోని భూ పరిపాలనను పారదర్శకంగా సులభంగా మార్చిందని తెలిపారు.  బీఆర్ఎస్ పాలనలో సరైన విధివిధానాలు లేకుండా తీసుకొచ్చిన 2020 ఆర్వోఆర్ చట్టం, ధరణి పోర్టల్ వల్ల లక్షలాదిమంది ప్రజలు తమ భూముల హక్కుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. భూమి తమదే అయినప్పటికీ హక్కులను నిరూపించుకునేందుకు అధికారుల, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, ఆనాటి పరిస్ధితులను చూసి అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుని గత ఏడాది ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతి పోర్టల్‌ను ఆవిష్కరించామని చెప్పారు. రైతాంగానికి భూ భద్రత కల్పించడంలో భూభారతి ఒక బలమైన ఆయుధంగా మారిందన్నారు. భూ వివాదాలకు చరమగీతం పాడుతూ సామాన్యుడికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తగ్గించడంలో ఈ ఏడాది కాలం ఒక గొప్ప ముందడుగుగా నిలిచిందన్నారు. భూభారతి పోర్టల్ పాత చిక్కుముడులను విప్పడంలో కీలక పాత్ర పోషించిందని, ఈ పోర్టల్ ప్రారంభించిన ఏడాదిలోపే 5.20 కోట్లకుపైగా ప్రజలు దీన్ని సందర్శించారని, సుమారు 67 లక్షల మంది పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యారని తెలిపారు. రైతులకు పారదర్శకంగా సులభతరమైన సేవలందించేందుకు రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనఐసితో కలిసి రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను ఈనెల 2నుంచి ఐదు జిల్లాల్లోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభింమని మంత్రి పొంగులేటి వివరించారు. ఇక్కడ ఎదురయ్యే మంచి చెడులను పరిగణనలోకి తీసుకొని అవసరమైన మార్పులు చేర్పులు చేసి వచ్చే నెలలో జిల్లాకు ఒక మండలంలో ప్రారంభిస్తామని, ఈ ఐదు మండలాల్లో కూడా ప్రతి సర్వే నెంబరుకు భూధార్ నెంబర్‌ను కేటాయిస్తామని చెప్పారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

నిజాం కాలం నుంచి 378 గ్రామాలను నక్షాలు లేవు.  ఇందులో ఐదు గ్రామాలలో రీ సర్వే పూర్తి చేసి భూదార్ నెంబర్ కేటాయించామని, మిగిలిన 373 గ్రామాల్లో రోవర్స్ వంటి ఆధునిక సర్వే సాంకేతికతను ఉపయోగించి రీ సర్వే పనులు కొనసాగిస్తున్నామని, జిల్లాకు 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సర్వే చేపట్టబోతున్నామని, సర్వే అనంతరం హద్దులను గుర్తించి భూధార్ నెంబర్ ఇస్తామని కూడా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇలా సర్వే నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నెంబర్లు వినియోగంలో ఉండగా అప్పటినుంచి ఈ 77 సంవత్సరాలలో 2.29కోట్లకు చేరాయని, వీటన్నింటికీ భూధార్ నెంబర్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని చెప్పారు. భూ సర్వేకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకున్నామని, శిక్షణ ఇచ్చి 5,520మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు లైసెన్స్‌లు జారీ చేశామని, భూ విస్తీర్ణాన్నిబట్టి ప్రతి మండలానికి నలుగురి నుంచి ఆరుగురు సర్వేయర్లను నియమించామని చెప్పారు. రాష్ట్రంలోని 10,984 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించి జీపీవోలను నియమించామని, గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశామని, త్వరలో మరో 400 కొనుగోలు చేయబోతున్నామని, భూ భారతి పోర్టల్ ప్రారంభించిన గత ఏడాది ఏప్రిల్ 14 నుంచి  ఇప్పటివరకు 3.80 లక్షల పాస్ బుక్‌లు జారీ చేశామని మంత్రి పొంగులేటి వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *