– ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై నిరసన జ్వాలలు
– ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులు?
– లబ్ధిదారుల ఎంపికపై వెల్లువెత్తుతున్న విమర్శలు
– అసలైన భూదాన్ బాధితులకు తీవ్ర అన్యాయం
ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 12 ఖమ్మం నగర శివార్లలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం ఇంకా చల్లారలేదు. ఇళ్లు కూల్చివేసిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసినప్పటికీ లబ్దిదారుల ఎంపికలో భారీ అవకతవకలు జరిగాయంటూ అసలైన బాధితులు ఆందోళనకు దిగారు. మరోవైపు తాత్కాలిక షెల్టర్లలో ఉన్న వారిని అధికారులు బలవంతంగా ఖాలీ చేయించడం ఉద్రిక్తతకు దారితీసింది. వెలుగుమట్లలో భూదాన్ ట్రస్టు బోర్డుకు సంబంధించి సర్వే నంబర్లు 147, 148, 149లో సుమారు 62.7 ఎకరాల భూమి ఉంది. జిల్లా కలెక్టర్ మాత్రం 31 ఎకరాల 7 గుంటల భూమినీ రాజా రామారావు భూదాన్ ఉద్యమంలో దానం చేశారని తెలిపారు. మిగిలిన భూమి ప్రైవేట్ భూమి అని తెలిపారు. ఇందులో కొంతమంది పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకోగా 15 రోజుల కిందట భారీ పోలీసుల బలగాలతో రెవెన్యూ, మున్సిపల్ వర్గాలు ఇళ్ల నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేతలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైంది. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో విమర్శలపాలయ్యారు. ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు కీలక శాఖలు, కీలక వ్యక్తులు ఇక్కడ వారే కావడంతో భూదాన్ అంశం హాట్ టాపిక్ అయ్యింది. ఎట్టకేలకు ప్రభుత్వం, అధికారులు దిగి వచ్చి భూదాన్ భూముల్లో .. కూల్చిన చోటే ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ళు కోల్పోయిన బాధితుల్లో అర్హులైన 311 మందికి ఇళ్ల పట్టా ం ఇందిరమ్మ ఇల్లు (భూదాన్ భూముల వద్ద ).. మరో 101 మందికి ఇంటి నిర్మాణ పత్రాలను బుధవారం ఖమ్మం కలెక్టరేట్ లో అందజేశారు.
సుమారు 712 మంది ఇండ్లు కూల్చివేయగా 412 మందికి లబ్ది జరిగిందని అధికారులు చేబుతున్నారు. వారు వేస్తున్న లెక్కలు బాగున్నా అసలైన లబ్దిదారులకు రాలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మంత్రులకు అనుకూలంగా ఉన్న వారిని అర్హుల జాబితాలో చేర్చారని లబ్ది పొందని బాధితులు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. 15 రోజులుగా స్థానిక అంబేడ్కర్ భవనం, టీటీడీసీ భవనంలో ఆశ్రయం పొందుతున్న వారిని గురువారం అర్బన్ రెవెన్యూ అధికారులు, పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు. ఇక్కడ 200 మంది ఉండగా 50మందికి మాత్రమే ఇళ్ళు వచ్చాయని వారు పేర్కొంటున్నారు. మిగిలిన వారు ఆందోళనకు దిగారు. ఇల్లు రాకపోగా బలవంతగా ఖాళీ చేయిండం పట్ల మండిపడ్డారు. 15 రోజులుగా కంటికి నిద్ర లేదని, సరైన తిండి లేదని, ఇప్పుడు ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హుల ముసుగులో మంత్రుల సంబంధీకులకు ఇళ్ళు ఇచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. వెలుగుమట్లలో నిజమైన భూదాన్ బాధితులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా అనర్హులకు, అక్రమార్కులకు, పైరవీకారులకు పట్టాలు పంపిణీ చేశారని, అసలైన బాధితులకు తీవ్ర అన్యాయం జరిగిందని భూదాన్ భూముల బాధితులు పేర్కొన్నారు.ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఇటీవల విలేకరుల సమావేశంలో భూదాన్ బాధితులు సత్యనారాయణ రెడ్డి, నరగాని కోటేశ్వరరావు, రవి, సీతారాములు, కళ్యాణి, కవిత, జయమ్మలు మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా ఈ భూములలో గుడిసెలు వేసుకుని, ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నామని, కొందరు వ్యక్తులు తమ వద్ద డబ్బులు వసూలు చేసి ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు హడావుడిగా, సక్రమంగా సర్వే చేయకుండా అసలైన లబ్దిదారులను గుర్తించకుండా, పార్టీ కాలనీకి చెందని వారికి పట్టాలివ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా రాత్రింబవళ్లు చీకట్లో ఉండి పాములు, తేళ్ల మధ్య నివాసం గడిపి, నీళ్లు లేక, కరెంటు లేక అనేక ఇబ్బందులు పడ్డ తమలాంటి కుటుంబాలను గుర్తించకుండా అనర్హులను ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు. సర్వం కూలిపోయి రోడ్డుపాలైన తమలాంటి వారికి అన్యాయం చేయటం సరైనది కాదన్నారు. రీ సర్వే నిర్వహించి నిజమైన లబ్దిదారులను గుర్తించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. సమావేశంలో సిరికొండ కల్యాణి, గాదె భాగ్యలక్ష్మి, పసుమర్తి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.






