– ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు కలిసి పనిచేద్దాం
– జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కలిసి పనిచేద్దాం.. యావత్ ప్రపంచం ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా భవన్‌లో జర్మనీ ప్రతినిధులతో గురువారం సాయంత్రం ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వివిధ దేశాల రాజకీయ పార్టీలను ఒకచోట చేర్చి పురోగమన ఆలోచనా దిశలో నడిపించే మీ కృషిని తాము ఎంతో అభినందిస్తున్నామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ రైట్ వింగ్ భావజాలం ప్రమాదకరంగా మారుతోందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలకు, వాటి విలువలకు ఈ భావజాల వ్యాప్తి వల్ల ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. స్వేచ్ఛ-న్యాయం- ఐక్యత అనే సిద్ధాంతాలతో నడిచే సోషల్ డెమోక్రటిక్ పార్టీ స్వతంత్ర సంస్థలా పనిచేస్తూ ప్రపంచంలోని పలు రాజకీయ పార్టీలతో కలిసి ప్రోగ్రెసివ్ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ పార్టీకి 160 ఏళ్ల చరిత్ర ఉందని తెలిసి ఆనందంగా ఉందన్నారు. మీ పార్టీలాగే తాము కూడా వందేళ్ల చరిత్ర కలిగిన అతిపెద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన వారసులమని, ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకు రావడంతోపాటు దేశ నిర్మాణంలో అత్యంత కీలకంగా నిలిచిన పార్టీకి చెందినవారమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని మీరు కలవడం తమకు ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా ప్రొగ్రెసివ్ భావజాల వ్యాప్తికి కృషి చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో ఇటీవల హైదరాబాదులో భారత్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. అందులో వందకుపైగా దేశాలు పాల్గొని ప్రొగ్రెసివ్ ఆలోచనలు, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై విస్తృత చర్చలు చేశృాయని భట్టి చెప్పారు. రైట్ వింగ్ భావజాలం వల్ల ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కల్గిస్తోంది, విద్వేష భావం ప్రబలుతోంది అన్నారు. దీనివల్ల ప్రపంచమంతటా ఆందోళనలు, అస్థిరత పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను నమ్మే వాళ్లందరికీ ఇది బాధాకర విషయమని అన్నారు. జర్మనీ గొప్ప చరిత్ర కలిగిన దేశం. ప్రత్యేకంగా మెటలర్జీ రంగంలో మీ నైపుణ్యం ప్రపంచ ప్రసిద్ధం. ఇటువంటి సాంకేతికతలను, పారిశ్రామిక అభివృద్ధిని భారత్ కూడా ఆహ్వానిస్తుంది. రాష్ట్రంలో వనరులు, మౌలిక సదుపాయాలు విస్తారంగా ఉన్నాయి. మా ప్రజాప్రభుత్వం కూడా దృఢ సంకల్పంతో నిర్ణయాలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సమావేశంలో రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, బలరామ్ నాయక్, సురేష్ షెట్కార్, జర్మనీకి చెందిన ఫ్రెడ్రిచ్ ఈబర్ట్ స్టిఫ్టింగ్ సంస్థకు చెందిన ప్రతినిధులు డాక్టర్ సబీనా, మిక్రో గ్యాంథర్, క్రిస్టోఫస్, మాండ్వి కులక్షేత్ర, అనురాగ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





