యూరియా కొరత లేదు.. ఆందోళన వద్దు

– ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల్లోకి అటవీ, పోలీసు అధికారులు వెళ్లొద్దు
– మహిళా సంఘాలతో జిల్లాల్లో చేప పిల్లల పెంపకం

ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 27: వరద పరిస్థితులు.. అప్రమత్తత, ప్రజలకు అందించాల్సిన సహాయక చర్యలు, సంక్షేమ పథకాలు, ఇతర అత్యవసర సదుపాయాల కల్పనపై ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ఇక్కడ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత లేదని, కొరత ఉందనే వదంతులతో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, డిమాండ్‌కు తగిన విధంగా సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టం కింద పంటలు సాగు చేసుకుంటున్న రైతుల వద్దకు పోలీసు, అటవీ అధికారులు వెళ్లడానికి వీలులేదని ఆదేశించారు. ఈ రైతులకు ఇందిరా సౌరగిరి జలవికాసం ద్వారా సోలార్‌ పంపుసెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్పు, ఉద్యాన పంటలు ఉచితంగా అందజేస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. మూడేళ్లలో ఈ పథకం కింద రూ.12,600 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌ రోడ్లకు ప్రతిపాదనలు ఇవ్వడం ఆలస్యం అన్ని రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. సన్న బియ్యం అన్ని కుటుంబాలకు అందిస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 85% మందికి విద్యుత్‌ బిల్లు కట్టే పని లేకుండా పోయిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచామని, కార్డు విషయంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్లను సంప్రదించవచ్చని తెలిపారు. మహిళలకు మహలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు రాష్ట్ర మహిళలు కొనసాగించారని, ఈ ప్రయాణానికి సంబంధించిన రూ.6,880 కోట్లను మహిళల పక్షాన ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని వివరించారు. ఇందిరమ్మ ఇల్లు దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన పథకం అని డిప్యూటీ సీఎం తెలిపారు. రూ.5 లక్షలతో ఒక్కో నియోజకవర్గంలో 3500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 6.50 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నాయని, ఇందుకుగాను రూ.22,500 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఇల్లు నిర్మించుకోవడమే ఆలస్యం వారంవారం డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. ప్రతి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా చేప పిల్లల పెంపకానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం చెరువుల్లోకి వదులుతున్న 89 కోట్ల చేప పిల్లలను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నామని, ఇందుకు బదులుగా అన్ని జిల్లాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా చేప పిల్లల పెంపకం చేపడితే వారికి ఉపాధితోపాటు పెద్ద వ్యాపారం సృష్టించవచ్చని, ఈమేరకు కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరిని సాదరంగా ఆహ్వానిస్తున్నామని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా జీవితం మొదలుపెట్టిన ఆయన అనుభవం ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. కాగా, గోదావరి వరదలు ఇప్పటివరకు సాధారణ స్థితిలో ఉన్నాయి.. ఇప్పటివరకూ ఒక్క ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయలేదు.. వరద సహాయ చర్యలను అధికారులు విస్తృతంగా చేపట్టాలని, లైఫ్‌ జాకెట్స్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలం పూర్తయ్యేవరకు కంట్రోల్‌ రూమ్‌ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

వన మహోత్సవంలో ప్రజలకు ఉపయోగపడే మొక్కలు అందించాలని, వాటివల్ల అందరికీ ఉపయోగం ఉంటుందని అన్నారు. గత పదేళ్లుగా ఎన్ని మొక్కలు పెట్టారు.. వాటకైన ఖర్చు ఎంత.. వాటిలో ఎన్ని మొక్కలు బతికాయి.. మొత్తం వివరాలు అందించాలని మంత్రి భట్టి అధికారులను ఆదేశించారు. ఒక మేజర్‌ పంచాయతీలో గత పదేళ్లుగా మీరు నాటిన మొక్కలు ఎన్ని.. పెట్టిన ఖర్చు ఎంత.. బతికిన మొక్కలు ఎన్ని.. మొక్కలు బతకడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి అనేవి పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద పూర్తిగా అధ్యయనం చేసి వివరాలు అందించాలన్నారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలన్నీ రోల్‌ మోడల్‌గానే ఉండాలన్నారు. సంక్షేమ, గురుకుల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, క్వాలిటీ విషయంలో రాజీపడవద్దని, విద్యార్థులకు నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *