– ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే లింగ భేదం సమస్య నివారణ
– స్వయం సహాయక సంఘాలతో 2,000 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి
– లింగ సమానత్వం సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 17: మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే లింగ వివక్ష సమస్య నివారించే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నిజాం కళాశాలలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన లింగ సమానత్వం సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు రూ.20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం వివరించారు. ఈ కార్యక్రమం ప్రకటించగానే ప్రతిపక్షాలు అపహస్యం చేశాయి.. కానీ మేం మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగాం.. మొదటి ఏడాదిలో రూ.21,632 కోట్లు వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేశామని వివరించారు. అయిదేళ్ల కాలంలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఈ రాష్ట్రంలోని మహిళల చేతిలో తిరిగితే ఆర్థిక స్వాతంత్రం, లింగ సమానత్వం సాధ్యమవుతుంది అని చెప్పారు. విద్యార్థినులు బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలి.. ఉద్యోగాలు సాధించలేని వారు ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలతో వ్యాపారాలకు నాంది పలకాలని డిప్యూటీ సీఎం సూచించారు. నిర్మాణ, విద్యుత్ రంగాల్లో కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులే నిలబడి విజయం సాధిస్తారని ప్రచారంలో ఉంది కానీ తాము అందుకు భిన్నంగా గ్రీన్ పవర్ ఉత్పత్తిలో భాగంగా మహిళా సంఘాలతో 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారితో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి ప్రభుత్వమే వారు ఉత్పత్తి చేసిన విద్యుత్తును కొనుగోలు చేసి బిల్లులు చెల్లిస్తుందని ఆమేరకు విద్యుత్ సంస్థలు మహిళా సంఘాలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. ఈ తరహా కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాల ద్వారా 650 బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇప్పించి ఆదాయం వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అమ్మ క్యాంటీన్లు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులు, ఇందిరమ్మ ఇళ్లు అన్నిటినీ మహిళల పేరిటే మంజూరు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఆత్మగౌరవం, లింగ సమానత్వం, వరకట్న నిషేధం, తల్లిదండ్రుల ఆస్తిలో వాటా వంటి హక్కులు దక్కాయి అంటే అవి కేవలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లేనని తెలిపారు.
పూర్వ విద్యార్థిగా గర్వపడుతున్నా
1880లో ప్రారంభించిన నిజాం కళాశాల చాలా గొప్పదని, ఈ రాష్ట్రం, దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి గొప్ప సైంటిస్టులను, రాజకీయ నాయకులను, పరిపాలకలను అందించిందని భట్టి వివరించారు. 2010-14 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్‌గా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగిన తాను అందరం నిజాం కళాశాల విద్యార్థులస్త్ర కావడం మరువలేని జ్ఞాపకం అని అన్నారు. 1982-84 మధ్యకాలంలో నిజాం కళాశాలలో తన సహచరులు గొప్పగా చదువుకొని అమెరికాలో సైంటిస్టులుగా స్థిరపడ్డారని, వారంతా నిత్యం కలుస్తుంటారని భట్టి విక్రమార్క చెప్పారు. నిజాం కళాశాలలో ఉన్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని, పూర్వ విద్యార్థిగా ఒక రోజు నిజాం కళాశాలలో గడపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.




