మధిర/ ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : పట్టు వదలని విక్రమార్కుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని మరోమారు రుజువైంది.  మధిర మున్సిపాలిటీని 22 స్థానాలకుగాను 21వార్డుల్లో కాంగ్రెస్ కూటమి ఏకపక్షంగా గెలుచుకొని విజయ దుందుభి మోగించింది. బీఆర్ఎస్, సీపీఎం, సిపిఐ కూటమి ఒకే ఒక్క వార్డుకు పరిమితం కావడం భట్టి రాజకీయ చాణక్యానికి అద్దం పట్టింది. రాబోయే 50 సంవత్సరాలకు సరిపడా మధిర అభివృద్ధికి చేస్తున్న కృషిని ఓటర్లకు తానే స్వయంగా వివరించి వారి మనసు గెలిచి ఘన విజయం సాధించారు. మధిర మున్సిపాలిటీలో ఏ పార్టీ బలం ఎంతో వాస్తవంగా అంచనా వేసి టిడిపితో కూటమిగా బరిలో దిగారు. 22 వార్డుల్లో టిడిపి బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు మూడు వార్డుల్లో పోటీలో నిలవగా, మిగిలిన 19 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. తన గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతగా శ్రమిస్తారో, అంతకుమించి మున్సిపాలిటీలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపునకు డిప్యూటీ సీఎం శ్రమించి గొప్ప స్ఫూర్తిని నింపారు.  స్వయంగా తానే ప్రచార రంగంలోకి దిగారు. తాను డిప్యూటీ సీఎం అయినా చిన్న మున్సిపాలిటీలో ప్రచారం చేయడం అవసరమా అనే భావన లేకుండా వార్డుల వారీగా ప్రచారంలోకి దిగారు. రాబోయే 50 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా మధిర పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారో కళ్లకు కట్టినట్టు వివరించి ఓటర్లను మెప్పించారు. స్వచ్ఛమైన, సుందరమైన మధిర కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా విద్యుత్తు, వరద నీటి ఇబ్బంది లేకుండా వైరా నదికి అడ్డంగా కరకట్ట, మధిర పట్టణ విస్తరణకు హైదరాబాద్ తరహాలో ఔటర్ రింగ్ రోడ్డు వంటి పనులకు అనుమతులు సాధించి వేగంగా పనులు చేపడుతున్న తీరును వివరించారు.  ఈ మున్సిపాల్టీ కి ఎన్నిక జరగడం మూడవ విడత. మొదటిసారి కాంగ్రెస్ విజయం సాదించనప్పటికి అపుడు బి.ఆర్.ఎస్. అధికారంలో ఉండడంతో నేతలు పార్టీ మారారు. రెండోసారి బి.ఆర్.ఎస్. గెలిచింది. తాజాగా మూడోసారి కాంగ్రెస్ గెలిచింది. డిప్యూటీ సీఎం కీలక అనుచరుడు పార్టీ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి భార్య లక్ష్మి తులసి (6వ్ డివిజన్) చైర్ పర్సన్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. శ్రీనివాసరెడ్డి కి ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్ష స్థానం సామాజిక సమీకరణాల్లో జస్ట్ మిస్ అయింది. డీతో ఆయన మిస్సెస్ కు ఛైర్మెన్ గిరి ఖాయమనే బలంగా పార్టీలో ప్రచారం జరుగుతుంది. మధిర పక్కన ఉన్న వైరా మున్సిపాటీ ని సైతం భట్టి గెలిపించి తన సత్తా చాటారు. ఆయన వర్గం నుంచే చైర్ పర్సన్ కానున్నారు.

ప్రజా పాలనకు పట్టం కట్టిన ప్రజలు