బీఆర్‌ఎస్ నేతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విసుర్లు
నాగార్జునసాగర్, ప్రజాతంత్ర, జులై 18: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిరచినా, పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా బీఆర్‌ఎస్ నేతల తీరు మారలేదు.. పదేళ్లు అనుభవించిన అధికారం దూరమైందనే బాధతో ఆ పార్టీ నేతలు మాట్లాడే భాషతో సమాజం తలదించుకుంటోంది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నాగార్జునసాగర్ పర్యటనలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం స్థాయి వ్యక్తిపై బీఆర్‌ఎస్ నేతలు ఈరోజు వాడిన భాష ఏం భాష.. ఏం సంస్కృతి.. మన భాషను ప్రజలు నేర్చుకుంటారనే సోయి కూడా వారికి లేదు అని ఆయన ఎద్దేవా చేశారు. నీళ్ల కోసమే అధికారాన్ని తెచ్చుకున్నాం.. పదేళ్లు పరిపాలించిన బీఆర్‌ఎస్ నేతలు మొద్దు నిద్ర మూలంగా కృష్ణా, గోదావరి జల్లాలో వాటాలు తేల్చుకోలేకపోయాం.. వారి కాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో ప్రస్తుతం నీళ్ల సమస్య ఏర్పడిరదని చెప్పారు. ఇప్పుడు గొప్పగా చెబుతున్న రివర్స్ పంప్‌డ్ స్టోరేజ్ టెక్నాలజీని 1978లో నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ పాలకులు అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అంచనాలకు అందుకునే విధంగా రాష్ట్రంలోని అన్ని హైడల్ ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నాగార్జునసాగర్ హైడల్ విద్యుత్ ఉత్పత్తిపై శుక్రవారం సమీక్ష జరిపామన్నారు. 17,162 మెగావాట్ల డిమాండ్ వచ్చినా రెప్పపాటు కాలం కూడా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాల మూలంగా కొత్తగా పరిశ్రమలు ఏర్పడి విద్యుత్ డిమాండ్ పెరిగిందని, ఫలితంగా జిడిపి పెరుగుదలకు దోహదపడిరదని చెప్పారు. కాలుష్య రహిత, తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే గ్రీన్ పవర్ ఉత్పత్తిపై దృష్టి పెట్టామని, 2029-30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి వివరించారు. ప్రపంచంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే రీతిలో విద్యుత్ సిబ్బంది, ఆర్టిజెన్లు మొదలు సీఎండి వరకు శిక్షణ ఇస్తామని చెప్పారు.





