– బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి
– 9న విజన్ డాక్యుమెంట్-2047 ఆవిష్కరిస్తాం
– దానికి కేంద్ర మంత్రులు, ప్రముఖులను ఆహ్వానిస్తున్నాం
– ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో ప్రశ్నించడం, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు ఇవ్వాలనుకుంటే విషయాన్ని వివరిస్తే నిర్దేశిత ఫార్మాట్‌లో సమాచారాన్ని, వినతి పత్రాలను దిల్లీలోని రాష్ట్ర అధికారులు ఎంపీలకు అందజేస్తారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో రాష్ట్ర ఎంపీలతో భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో గురువారం సమావేశమై పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం 9వ షెడ్యూల్‌లో సవరణ జరగాలని, ఈ అంశంపై పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చకు తీసుకురావాలని కోరారు. నిర్దేశిత ఫార్మాట్‌లో వాయిదా తీర్మానం లేదా ప్రశ్న గంటలో చర్చకు తేవాలని, ప్రధానమంత్రిని కలిసి అన్ని పార్టీల ఎంపీలు ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని సూచించారు. ప్రధానమంత్రి సమయం ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన దిల్లీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించాలన్నారు. బీసీల రిజర్వేషన్‌కు సంబంధించి రాష్ట్రంలో ఎపిక్ సర్వే జరిగిందని, ఎంపిరికల్ డాటా ఆధారంగా అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టగా పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించారని తెలిపారు. బిల్లు గవర్నర్ నుంచి కేంద్రానికి వెళ్లి అక్కడ పెండింగ్‌లో ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలందరూ పార్టీలకతీతంగా ఒక బృందంగా ఏర్పడి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని చెప్పారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలు అడిగిన సమాచారం వెంటనే అందించేందుకు దిల్లీలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామంటూ దాన్ని ఎంపీలు వినియోగించుకోవాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రభుత్వ శాఖలు ఏ విధంగా పూర్తి సంసిద్ధంగా ఉంటాయో పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండి సమాచారం అందించేందుకు ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, జీఎస్టీ తదితర విషయాలకు సంబంధించి కేంద్ర నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, పథకాలకు సంబంధించి గతంలో లేఖలు రాశామని, ఆ లేఖలు దిల్లీలోని ప్రత్యేక విభాగంలో ఎంపీలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వాటి ఆధారంగా ఎంపీలు ఫాలోఅప్ చేసే అవకాశం ఉంటుందన్నారు.
డిసెంబర్ 9న 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
ప్రజా ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 9 నాటికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సాధించిన విజయాల వివరించడంతోపాటు రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ చేయబోతున్నామని భట్టి వెల్లడిరచారు. దేశంలో, ప్రపంచంలో ప్రముఖులను, దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని, 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యసాధనకు అవసరమైన వనరులు, ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కమిటీలు వేస్తున్నామని, కేంద్ర మంత్రులు, ఎంపీలందరినీ ఆహ్వానించాలని భావిస్తున్నామని, ఆసక్తి ఉన్న ఎంపీలు పేర్లు ఇస్తే కమిటీలో సభ్యులుగా చేరుస్తామని తెలిపారు. దేశంలో, ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు, సంస్థలతో ఎంపీలు ఎవరికైనా పరిచయం ఉంటే వివరాలు ఇస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం వారిని గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తామన్నారు. కాగా, సమావేశంలో కేంద్రానికి సంబంధించిన 12 శాఖల ద్వారా 47 అంశాలను గుర్తించగా వీటితోపాటు సెమీ కండక్టర్లకు సంబంధించిన అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. 12శాఖలకు సంబంధించిన 47 అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్, రామసహాయం సురేందర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, అనిల్‌కుమార్ యాదవ్, బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు. నగేష్‌లు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున సీఎస్ రామకృష్ణారావు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





