వడ్డీ లేని రుణాలపై భట్టి అబద్ధాలు

– అవి ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా
– మూసీ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
– ఫార్మా సిటీ భూములు రియల్ ఎస్టేట్‌కా..
– ఏడీబీ రుణంపై మంత్రి శ్రీధర్‌బాబు అసత్యాలు
– గవర్నర్ ప్రసంగం, పాలనా వైఫల్యాలపై కేటీఆర్ చిట్‌చాట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని మంత్రి భట్టి విక్రమార్క చెప్తున్నారని, ఇచ్చినట్టు నిరూపిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అదే సమయంలో సీతక్క తనను రాజీనామా చేయమంటున్నారని, అసెంబ్లీలో అబద్ధాలు చెప్పినవారే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. భట్టి గానీ, సీతక్క గానీ ఎవరు రాజీనామా చేస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టు, వడ్డీ లేని రుణాలు, గవర్నర్ ప్రసంగం, పరిపాలనా వైఫల్యాలపై ఆయన అసెంబ్లీలో చిట్‌చాట్‌లో పదునైన ప్రశ్నలు లేవనెత్తారు. ఏడీబీ రుణంపై మంత్రి శ్రీధర్‌బాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డీపీఆర్ ఇచ్చామని చెప్తున్నప్పటికీ వాస్తవానికి సమర్పించకపోవడంతోనే రుణం మంజూరు కాలేదని తెలిపారు. మూసీ ప్రాజెక్టు విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని, ఆరు నూరైనా పూర్తి చేస్తాం అనే వ్యాఖ్యలు చేయడం వారి అధికార పరిధికి మించినదని అన్నారు. సభను తప్పుదోవ పట్టించినందుకు మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామన్నారు. మూసీ ప్రాజెపై తమకు వ్యతిరేకత లేదని, కానీ దాని పేరిట జరుగుతున్న లూటీకి వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టం చేశారు. 5 కి.మీ దూరంలో ఉన్న ప్రజలకు కూడా నోటీసులు ఇస్తూ వేలాది కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. 3297 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి 10 వేల ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పుడు 1400 ఇళ్లు మాత్రమే అంటున్నారని, ఇది పూర్తిగా ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. మధు పార్కు కోసం ప్రత్యేకంగా ఇళ్లు ఇస్తామని ఎందుకు చెప్తున్నారు? మిగతా వారికి ఎందుకివ్వరు అని ప్రశ్నించారు. అధికార యంత్రాంగం నియంత్రణ తప్పిందని, కుక్క తోకను ఆడించటం కాదు.. తోక కుక్కను ఆడించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఫార్మా సిటీ పేరిట భూ సేకరణ చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలకు, ఇతరులకు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టుల మధ్య ప్రజలను ఎలా నివసింపజేస్తారని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు, ఫార్మా సిటీకి శ్రీకారం చుట్టింది గత బీఆరఎస్ ప్రభుత్వమేనని, ఎస్టీపీలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించిన ఘనత కేసీఆర్‌దని గుర్తుచేశారు. గవర్నర్ ప్రసంగంలో కూడా అసత్యాలు ఉన్నాయని, రూ.57 వేల కోట్ల రుణాల అంశంపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. పీపీటీ కార్యక్రమానికి రాలేదని విమర్శించడం అనవసరమని, తాము నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నామని తెలిపారు. వెలుగుమట్ల వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ పెద్దలు ఎందుకు వెళ్లి చూడలేదని ప్రశ్నించారు. మీన్‌హార్ట్ అనే కంపెనీని భారత్‌లోనే నిషేధించారని, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కూడా బ్యాన్ చేసిన సంస్థను ఎందుకు ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించారు. పాకిస్తాన్‌లో పనికిరాని కంపెనీ మనకు ఎలా పనికొస్తుందని నిలదీశారు. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఎలా సమీకరిస్తుందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ డబ్బులను ఆరు గ్యారంటీలకు వినియోగిస్తే మేలని సూచించారు. హనుమాన్ నగర్ వంటి ప్రాంతాల్లో బఫర్ జోన్ పేరిట దూర ప్రాంతాల ప్రజలకు నోటీసులు ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. పొంగులేటి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి వారి ఇళ్లు కూడా అదే జోన్‌లో ఉన్నాయని, రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని తెలిపారు. మూసీ ప్రాజెక్ట్టు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని, గాంధీ సరోవర్, రాహుల్ గాంధీ సరోవర్ పేర్లతో కొత్త నాటకాలు ఆడుతున్నారా అని ప్రశ్నించారు. అమీన్‌పూర్‌లో కూల్చివేసిన ఇళ్లకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తమ పార్టీ బీ ఫాం మీద గెలిచిన వారికి క్లీన్‌చిట్ ఇచ్చారు.. తమను తిడితే కూడా ఖండించలేదు.. అలాంటప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తారు అని ప్రశ్నించారు. తమ ధాటికే ప్రభుత్వం తట్టుకోవడం లేదు.. కేసీఆర్‌ను ఎలా తట్టుకుంటారు అని వ్యాఖ్యానించారు. పొంగులేటి కుమారుడు కబ్జాలు చేసిన సంఘటనలో సంబంధిత అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వం వైఖరిని తెలుపుతోందŠని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రోజురోజుకూ బయటపడుతోందని, ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం అన్ని అంశాల్లో పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
———————————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *