వ్యక్తిగత నిర్ణయాలతో కాళేశ్వరం కుంగింది

 – పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై డిప్యూటీ సీఎం భ‌ట్టి 

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 04 :  తెలంగాణ రాష్ట్ర ప్రజలు జల హక్కు కోసం పోరాడి సాధించిన రాష్ట్రంలో, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం వ్యక్తిగత నిర్ణయాల వల్ల కుంగిపోయింద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.  పీసీ ఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ నివేదికపై మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాలపై విచారణ చేపట్టేందుకు జ్యుడీషియల్ కమిషన్ నియమించామన్నారు. ‘‘మేము చెబుతున్న ప్రతి అంశం రాజకీయానికి అతీతం. కమిషన్ అందించిన నివేదికలోని వాస్తవాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాం,’’ అని స్పష్టం చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టు భావన దశ నుంచి మూడు బ్యారేజీలు చేపట్టడం అప్పటి సీఎం ఏకైక నిర్ణయమ‌ని అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం మూడు బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం ఆనాటి సీఎం నీటిపారుదల శాఖ మంత్రుల ఏకైక నిర్ణయం తప్ప ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక నిర్ణయం కాదని ఘోష్ కమిషన్ స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ క్యాబినెట్ సబ్ కమిటీ లో జరిగిన నిర్ణయం క్యాబినెట్‌లో ఆమోదం పొందిందని చెప్పడం సరికాదు. క్యాబినెట్‌లో ఆమోదం జరగలేదు. ఆయన కమిషన్ కు తప్పుగా రిపోర్ట్ చేశారని కమిషన్ స్పష్టం చేసింద‌న్నారు. ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడడంలో నిబద్ధత సమగ్రత లేకపోవడాన్ని నాటి ఆర్థిక మంత్రి ప్రదర్శించారు. కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తెలియవని నాటి ఆర్థిక మంత్రి చెప్పడం సరైనది కాదని కమిషన్ స్పష్టం చేసింద‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన బ్యాక్ వాటర్ స్టడీస్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ వంటి అధ్యయనాలు జరగలేదు. క్షేత్ర అధ్యయనాలు జరగకుండా వివరించలేనంత ఆలస్యంతో డిజైన్లు తయారు చేశారు. తుమ్మిడి హెట్టిలో నీటి లభ్యత లేదని చెప్పడం సరికాదు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ చెప్పిన ప్రకారం మ్యారేజి నిర్మాణ స్థలం మార్చామని చెప్పిన విధానం కరెక్ట్ కాదు  తెలంగాణ రాష్ట్ర జీవనాడిగా ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీయ నాయకత్వ అనవసర జోక్యం, రాజకీయ జోక్యంతో ప్రణాళిక, పాలన, సాంకేతిక పర్యవేక్షణ, ఆర్థిక క్రమశిక్షణ ప్రజాధనాన్ని భారీగా వృథా చేసిందని ఘోష్ కమిషన్ స్పష్టంగా చెప్పిందని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *