సన్న బియ్యం పంపిణీ దేశంలోనే రికార్డు

– అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల మాదిరిగా పరుగులు పెట్టిస్తున్నాం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: రేషన్‌ కార్డు అంటేనే ఆహార భద్రత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర నియోజకవర్గం బోనకల్లు మండల కేంద్రంలో సోమవారం జరిగిన కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అత్యంత పేదలతోపాటు, ఆర్థికంగా వెనుకబడిన మధ్యతరగతి వర్గాలకు కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో రేషన్‌ కార్డుల పంపిణీ జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలు ఉండగా 93 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఇవ్వడమే కాదు, సన్న బియ్యం కూడా తమ ప్రభుత్వంలో పంపిణీ జరుగుతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని పేర్కొన్నారు. లబ్ధిదారుల సంఖ్యరీత్యా చూసినా, సన్న బియ్యం వారీగా చూసిపా ఈ దేశంలో ఆహార భద్రత విషయంలో తెలంగాణ ఒక రోల్‌ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. కొత్తగా పెళ్లి అయిన వాళ్లు రేషన్‌ కార్డుల్లో పేరు నమోదు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పులు, మార్పుల కోసం గత పదేళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. ఒక్క మధిర నియోజకవర్గంలోనే కొత్తగా 13,767 మంది లబ్ధిదారులకు ఒకేరోజు కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం సంతోషించదగిన అంశమన్నారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తుండగా ఈ పథకం కింద 51 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఇటీవలే తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతులకు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ కింద 21 వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు చెల్లించామన్నారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెడ్ల మాదిరిగా పరుగులు పెడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ఆర్‌ అండ్‌బి శాఖ ద్వారా రూ.20వేల కోట్లతో పనులు చేపట్టామని, విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యనందించేందుకు యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నామని భట్టి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *