పోలవరం, బనకచర్ల సంగతి తేలుస్తాం

– బీఆర్‌ఎస్‌, టీడీపీ కుమ్మక్కై తెలంగాణపై కుట్రలు
– ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేందుకు ఆర్డినెస్‌ తెచ్చారు
– సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ దిల్లీకి వెళ్లడంతోనే బనకచర్ల ఆగింది
– కొల్లాపూర్‌లోనే రాజకీయ ఓనమాలు దిద్దుకున్నా
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కొల్లాపూర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీలు కుమ్మక్కై బనకచర్ల, పోలవరం పేరిట తెలంగాణ రాష్ట్రంపై చేస్తున్న కుట్రల సంగతి తేలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హెచ్చరించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో సబ్‌ స్టేషన్‌కు శంకుస్థాపన, రేషన్‌ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ సందరత్భంగా శనివారం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. వృథాగా పోయే నీళ్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి లోకేష్‌ అమాయకంగా మాట్లాడుతున్న మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతోనే కిందకు వృథాగా నీళ్లు పోతున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎగువనున్న తమ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తిచేసుకుని మిగిలిన అన్ని రాష్ట్రాలకు వాటా పోయిన తర్వాతే బనకచర్ల విషయం మాట్లాడాలని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌) పదేళ్లు మొద్దు నిద్రపోయి గోదావరి నదిపై ప్రాజెక్టులు పూర్తిచేయకపోవడంతో బనకచర్ల జల వివాదం తెరపైకి వచ్చిందని, రాష్ట్రానికి ఆ పార్టీి ద్రోహం చేసిందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డిలు దిల్లీకి వెళ్లడంతోనే బనకచర్ల ఆగిందని తెలిపారు. దొంగతనంగా కేటీఆర్‌ లోకేష్‌ను ఎందుకు కలిశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారని, బనకచర్ల కడతామని ఏపీ ప్రభుత్వం అంటే దాన్ని కట్టనివ్వమని బీఆర్‌ఎస్‌ ప్రచారం మొదలుపెట్టాలని, తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించాలని రాత్రిపూట కేటీఆర్‌, లోకేష్‌ మాట్లాడుకున్నారని భట్టి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లోని రెండు లక్షల ఎకరాలు, లక్షలాదిమంది గిరిజనులు ముంపునకు గురవుతారని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం సోనియాగాంధీకి విన్నవిస్తే చట్టంలోంచి ఆ ఏడు మండలాలను తీసివేసి గిరిజనులకు సోనియాగాంధీ న్యాయం చేశారని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీ, అప్పటి టీఆర్‌ఎస్‌ కుమ్మక్కై ఏడు మండలాలు, రెండు లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారని వివరించారు. ఆ ఆర్డినెన్స్‌ను ప్రశ్నిస్తాం.. తెలంగాణ ప్రజలను గుండెలో పెట్టుకొని కాపాడతామని అన్నారు. గోదావరిపై 152 మీటర్ల ఎత్తులో ప్రాణహిత-చేవెళ్ల నిర్మించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదించగా నాటి సీఎం కేసీఆర్‌ దానికంటే కింది భాగాన వంద మీటర్ల ఎత్తులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్లను వదిలిపెట్టి రూ.1.20 లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించగా అది కుంగి కూలిపోయిందని చెప్పారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ పెద్దలు రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పై ప్రాంతంలో తెలంగాణ భూభాగంలో ఒక డ్యామ్‌ కడితే పెద్ద ఎత్తున కృష్ణ నీటిని తీసుకునే అవకాశం ఉన్నా నాటి బీిఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతం చేశామని తెలిపారు. పర్యాటక రంగంలో తెలంగాణ ప్రపంచాన్ని ఆకర్షించేలా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కృషిచేస్తున్నారని భట్టి తెలిపారు.

కొల్లాపూర్‌లో రాజకీయ ఓనమాలు దిద్దుకున్నా: భట్టి విక్రమార్క

తమ సోదరుడు స్వర్గీయ మల్లు అనంత రాములు 1980లో నాగర్‌ కర్నూల్‌ ఎంపీగా పోటీ చేసిన సమయంలో తాను విద్యార్థిగా ఉన్నానని, ఆ సమయంలో తనను కొల్లాపూర్‌ ఇన్‌చార్జిగా నియమించారని, ఆనాడే తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్నానని డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఊరూరా తిరిగి ప్రజలతో మమేకం కావడం కొల్లాపూర్‌తోనే ప్రారంభమైందని, తనకు మధిర నియోజకవర్గంతో ఎంతటి అనుబంధం ఉందో కొల్లాపూర్‌ తోనూ అంతే అనుబంధం ఉందని తెలిపారు. కొల్లాపూర్‌ ఎక్కడో దూరంగా ఉందని అంతా అనుకుంటారు కానీ ఈ నియోజకవర్గంలో అన్ని రకాల భావజాలాలు ఉన్నాయన్నారు. పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా కొల్లాపూర్‌లో రాజకీయ జీవితం ప్రారంభించిన తాను డిప్యూటీ సీఎంగా ఉన్నానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *