కన్నుల పండువగా భ‌ద్ర‌గిరరీశుడి తెప్పోత్సవం

– వేలాదిగా త‌ర‌లివ‌చ్చి త‌రించిన భ‌క్తులు
– తెల్లవారుజామున  ఉత్తర ద్వార దర్శనం
– ఏర్పాట్లు పూర్తి చేసిన ఆల‌య అధికారులు

భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సోమవారం నిర్వహించిన తెప్పోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వాముల ఉత్పవమూర్తులను సాయంత్రం 4 గంటల సమయంలో వేదమంత్రాలు, మేళతాళాలు, కోలాటాల మధ్య‌ ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకొచ్చి పవిత్ర గోదావరి నదిలో సుంద‌రంగా తీర్చిదిద్దిన హంస‌ వాహ‌నంపై వేంచేపు చేశారు. అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంత‌రం రంగురంగుల విద్యుత్‌ ‌దీపాలు, మామిడి తోరణాలు, పూలమాలలతో అలంక‌రించిన హంస వాహనంపై సీతారామచంద్రస్వాములను న‌దిలో విహ‌రింప‌జేశారు. నదీ తీరమంతా మామిడి తోరణాలతో కళకళలాడింది. హంస వాహనంపై ఉన్న స్వామివారిని చూసి తరించడానికి రాష్ట్రం నలుమూలల నుండి అనేకమంది భక్తులు తరలివచ్చారు. భక్తులతో భద్రాద్రి రహదారులు కిక్కిరిసిపోయాయి. హంస వాహనంపై స్వామివారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌, ఎస్‌పి రోహిత్‌రాజు, కుటుంబ సమేతంగా స్వామివారిని  దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అలాగే భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్‌ ‌తెల్లం వెంట్రావు స్వామివారిని దర్శించుకున్నారు. హంస వాహనంపై నృత్య ప్రదర్శన జరిగింది. స్వామివారి న‌దీ విహారం ప్రారంభం కాగానే బాణసంచా కాల్చడంతో భక్తుల్లో ఆనందో వెల్లివిరిసాయి.  జై శ్రీరాం.. జై శ్రీరాం అంటూ భక్తులు నినదించడంతో గోదావరి నదీ తీరం అంతా మారుమోగింది. వివిధ ఆకారాల్లో బాణసంచా వెలుగుల సుందర దృశ్యాన్ని భక్తులు కనులారా చూసి తరించారు. 15 రోజులపాటు తయారు చేసిన హంస వాహనం విజయవంతంగా గోదావరి తీరిలో విహరించింది. భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ప్రసాదాలు అంద‌జేశారు. అలాగే ప్రత్యేక దర్శన సౌకర్యం ఏర్పాటు చేశారు. అధికారులు భద్రాద్రిని సుందరంగా తీర్చిదిద్దారు. ఆల‌యంలో విద్యుత్ దీపాల‌ను సుంద‌రంగా ఏర్పాటు చేశారు. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసు తనిఖీలు ముమ్మరం చేశారు. భక్తుల వాహనాలను నిలిపేందుకు ప్రత్యేక స్థలం కేటాయించారు. వైద్య శిబిరాలను, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.

తెల్లవారుజామున  ఉత్తర ద్వార దర్శనం

తెల్లవారు జామున వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా జరగనుంది. ఆ సుందర దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ ఘ‌డియలు రానే వచ్చాయి. వైకుంఠ రాముడిని ద‌ర్శించుకుని త‌రించేందుకు భద్రాద్రికి రెండు రోజులనుండే వివిధ ప్రాంతాలనుండి భక్తులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. భక్తుల కోసం ప్రత్యేక సెక్టార్లను కూడా ఏర్పాటు చేసారు. వీవీఐపీలు, వీఐపీలు వచ్చినందున వారికి ప్రత్యేకంగా సెక్టార్లను ఏర్పాటు చేసారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *